-
మురికి కాలువలో మహిళ మృతి.. వీడిన కేసు మిస్టరీ
-
కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలో సంచలనం సృష్టించిన మహిళ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. అది సాధారణ మృతి కాదని, అత్యాచార యత్నాన్ని ఎదిరించినందుకు జరిగిన దారుణ హత్య అని పోలీసులు తేల్చారు. కేవలం 48 గంటల వ్యవధిలోనే సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల సహాయంతో వన్ టౌన్ పోలీసులు కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.
ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి ఆదిలాబాద్ పట్టణంలోని పంజాబ్ చౌక్ కూడలి వద్ద ఉన్న హల్దీరామ్ షాప్ సమీపంలోని మురికి కాలువలో జనగామ్వార్ అనిత అనే మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలి సోదరుడు జనగామ్వార్ సంతోష్ ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో హత్యగా అనుమానించిన పోలీసులు ఘటనా స్థలంతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పట్టాయి. సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుడిని మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
మద్యం మత్తులో కామాంధుడి ఘాతుకం..
పోలీసుల దర్యాప్తులో నిందితుడు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా హిమాయత్ నగర్ తాలూకా సిరంజని గ్రామానికి చెందిన నర్సింగా సంతోబా గంపల్వాడ్ (25) గా గుర్తించారు. సంఘటన జరిగిన రోజు రాత్రి పంజాబ్ చౌక్ సమీపంలో మద్యం సేవించిన నిందితుడు.. రోడ్డు పక్కన నిద్రలో ఉన్న చెత్త ఏరుకునే మహిళ ను గమనించాడు. ఎవరూ లేని మురికి కాలువ వద్దకు ఆమెను లాక్కెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. ఆ మహిళ తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆగ్రహంతో రగిలిపోయిన నిందితుడు ఆమె గొంతును బలంగా నొక్కి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆధారాలు మాయం చేసేందుకు మృతదేహాన్ని మురికి కాలువలో పడేసి పరారయ్యాడు.

కేసు నమోదు చేసిన 48 గంటల్లోనే పోలీసు బృందాలు నిందితుడి ఆచూకీ కనిపెట్టాయి. సోమవారం ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడు నర్సింగాను వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణలో, కేసుల దర్యాప్తులో సీసీటీవీ కెమెరాలు ఎంత కీలక పాత్ర పోషిస్తాయో ఈ కేసు మరోసారి నిరూపించిందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, వ్యాపార సముదాయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

