HomeCrime Newsకోర్టు ఉద్యోగాల పేరుతో టోకరా.. దంపతులపై కేసు, మహిళ అరెస్ట్

కోర్టు ఉద్యోగాల పేరుతో టోకరా.. దంపతులపై కేసు, మహిళ అరెస్ట్

• ఒక్కో ఉద్యోగానికి పది లక్షల డిమాండ్.. రూ. 18.50 లక్షలు స్వాహా

• బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఇచ్చోడ పోలీసులు

వాస్తవ నేస్తం,ఇచ్చోడ : కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకులను నమ్మించి రూ. లక్షల్లో వసూలు చేసి మోసానికి పాల్పడిన దంపతుల ఉదంతం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఇచ్చోడ మండలం కామగిరి గ్రామానికి చెందిన నక్కల రమణారెడ్డి సోదరుడు రాజశేఖర్‌రెడ్డికి ఉప్పాడి @ ఉమ్మడి శంకర్ పరిచయమయ్యాడు. ఇదే అదునుగా భావించిన శంకర్.. రాజశేఖర్‌రెడ్డి కుమారులకు కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఒక్కో ఉద్యోగానికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేయడంతో, బాధితులు విడతల వారీగా మొత్తం రూ. 18.50 లక్షల నగదును నిందితుడు శంకర్ మరియు అతని భార్య ఉప్పాడి @ ఉమ్మెడ లావణ్యల బ్యాంకు ఖాతాలకు ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేశారు.

అసలు మోసం బయటపడిందిలా..!

డబ్బులు తీసుకున్న చాలా కాలం గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు నిందితులను నిలదీశారు. దీంతో తాము ఉద్యోగాలు ఇప్పించలేకపోయామని, తీసుకున్న డబ్బులు పూర్తిగా వెనక్కి ఇచ్చేస్తామని నిందితులు నమ్మబలికారు. కేవలం రూ. 1 లక్ష మాత్రమే తిరిగి ఇచ్చి, మిగిలిన రూ. 17.50 లక్షలు చెల్లించకుండా రోజులు గడుపుతూ కాలయాపన చేయసాగారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితుడు నక్కల రమణారెడ్డి ఇచ్చోడ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఇచ్చోడ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో A2 నిందితురాలు ఉప్పాడి @ ఉమ్మెడ లావణ్య (40), భర్త: ఉమ్మెడ శంకర్, నివాసం: జీడిమెట్ల, హైదరాబాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా, ఆయన కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.

ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికే దళారులతో జాగ్రత్త : ఇచ్చోడ ఎస్‌హెచ్‌ఓ నరేష్ కుమార్

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికే దళారులను, మోసగాళ్లను నమ్మి ఎవరూ ముందుగా డబ్బులు చెల్లించవద్దని ఇచ్చోడ ఎస్‌హెచ్‌ఓ నరేష్ కుమార్ ప్రజలకు సూచించారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడితే వెంటనే పోలీసులను సంప్రదించి అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular