• ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస
• లింగూగూడలో అంత్యక్రియలు
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : విప్లవోద్యమంలో సుమారు మూడు దశాబ్దాల పాటు చురుకైన పాత్ర పోషించిన సీనియర్ మాజీ మావోయిస్టు నేత కామ్రేడ్ రాధాక్క (అసలు పేరు కుర్సంగె మోతీబాయి) కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె.. ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం (ఆగస్టు 31న) సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈమె మావోయిస్టు సీనియర్ నేత చంద్రన్న సహచరి.
రాధాక్క 1984లో సీపీఐ(ఎంఎల్) పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. తొలుత సిర్పూర్ దళ సభ్యురాలిగా పనిచేసిన ఆమె.. 1986లో పార్టీ పూర్తిస్థాయి సభ్యత్వాన్ని పొందారు. ఆమె పనితీరుకు గుర్తింపుగా 1989లో ఏరియా కమిటీ సభ్యురాలిగా , తర్వాత ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యురాలిగా అంచెలంచెలుగా ఎదిగారు. అనంతరం 2003లో దండకారణ్యానికి బదిలీపై వెళ్లిన రాధాక్క.. అక్కడ ‘క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘం’ బాధ్యతలు చేపట్టి గిరిజన మహిళలకు నాయకత్వం వహించారు.
అనారోగ్యంతో అరెస్ట్, జైలు జీవితం..
దండకారణ్యంలో ఉన్న సమయం నుంచే రాధాక్కను గుండె సంబంధిత సమస్యలు వేధించాయి. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఆస్పత్రికి వెళ్తున్న క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో 2013 నుంచి 2016 వరకు తెలంగాణలోని పలు జైళ్లలో ఆమె శిక్ష అనుభవించారు. 2016లో జైలు నుంచి విడుదలైన తర్వాత, ఆమె తన భర్త చంద్రన్నతో కలిసి పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఇటీవల అనారోగ్యం తీవ్రం కావడంతో పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదిలాబాద్ రిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాధాక్క అంత్యక్రియలను మంగళవారం (సెప్టెంబర్ 1న) ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదిలాబాద్ రూరల్ మండలం, అంకోలి రోడ్‌లోని వాన్వాట్ – మామిడిగూడ గ్రామాల మధ్య ఉన్న ‘లింగూగూడ’లో ఈ అంత్యక్రియలు జరగనున్నాయి.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!
జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్