• 48 గంటల్లోనే కేసు మిస్టరీ వీడిన వైనం
• ఆరుగురు నిందితుల అరెస్ట్, రిమాండ్
• మద్యం తాగించి, గొంతు నులిమి దారుణం
• వివరాలు వెల్లడించిన ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: జిల్లాలోని నేరడిగొండ మండలంలో సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారంలో అడ్డుగా ఉన్నాడనే కక్షతోనే పథకం ప్రకారం స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు హత్యకు పాల్పడిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నేరడిగొండ మండలం పెద్దబుగ్గారం గ్రామానికి చెందిన నాతరి సతీష్ (23) ఈ నెల 17న అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులకు, 19న బోథ్ మండలంలోని కరాత్‌వాడ చెరువులో సతీష్ మృతదేహం లభ్యమైంది. దీంతో ఈ కేసును హత్య కేసుగా మార్చి పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల సహాయంతో ప్రత్యేక బృందాలు గాలించి 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నాయి.
మద్యం తాగించి.. గొంతు నులిమి..
ప్రధాన నిందితుడైన షేక్ సుమేర్ ప్రేమ వ్యవహారానికి సతీష్ అడ్డువస్తున్నాడనే కోపంతో ఈ హత్యకు కుట్ర పన్నాడు. తన స్నేహితులతో కలిసి సతీష్‌ను మద్యం పార్టీ పేరుతో కరాత్‌వాడ చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బలవంతంగా మద్యం తాగించి, అనంతరం గొంతు నులిమి దారుణంగా హత్య చేశారు. ఆధారాలు మాయం చేసేందుకు శవాన్ని చెరువులో పడేసి, సతీష్ బైక్‌ను ఆదిలాబాద్‌కు తరలించారు. మొబైల్ ఫోన్‌ను మాత్రం ఓ రైలులో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.

మృతుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడని తెలిసి కూడా నిందితులు ఈ దారుణానికి పాల్పడటంతో.. వారిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి 5 మొబైల్ ఫోన్లు, నేరానికి వాడిన 2 ద్విచక్ర వాహనాలు, మృతుడి బైక్, సంఘటనా స్థలంలో దొరికిన 7 ఖాళీ బీరు సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన నిందితులు వీరే..
ఈ హత్య కేసులో నేరడిగొండ మండలం కుమారి గ్రామానికి చెందిన (ప్రస్తుతం బోథ్ నివాసి) షేక్ సుమేర్ (24) ను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఇతనితో పాటు నేరడిగొండకు చెందిన గంగాధరి సాయి కృష్ణ (23), కుప్తి గ్రామానికి చెందిన బొజ్జ విష్ణువర్ధన్ (22), బోథ్ పట్టణం ఇస్లాంపురా కాలనీకి చెందిన షేక్ అక్రమ్ (22), అలాగే బోథ్ సాయినగర్ కాలనీకి చెందిన అబ్దుల్ నెహెఫ్ (19), సయ్యద్ నోమాన్ (19) లను సహ నిందితులుగా అరెస్ట్ చేసినట్లు పోలీసులువెల్లడించారు.
