• తెరపైకి బడుల అక్రమాల చర్చ..!!
• తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిందే.. మరి ఆరోపణల సంగతేంటి..?
• ఫీజుల దోపిడీపై అధికారుల మౌనం పలు అనుమానాలకు తావు
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఇటీవల అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో ఓ విద్యార్థి నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పోలీసులు ఈ వ్యవహారంలో వేగంగా స్పందించి చర్యలు తీసుకున్నారు. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా వసూళ్లకు పాల్పడితే కచ్చితంగా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిందే. ఎస్పీ అఖిల్ మహాజన్ లాంటి నిక్కచ్చి అధికారుల పనితీరును ప్రజలు ఎప్పుడూ స్వాగతిస్తారు.
అయితే, ఈ ఉదంతం వెనుక ఉన్న మరో కోణం ఇప్పుడు విద్యావ్యవస్థలోని లోపాలపై సర్వత్రా చర్చకు దారితీస్తోంది. అదే విద్యార్థి నాయకుడు గతంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్నాయని భావిస్తున్న ఫీజుల దోపిడీ , నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల విక్రయాల గురించి సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. ఈ ఆరోపణలపై సంబంధిత విద్యాశాఖ అధికారులు పెద్దగా స్పందించిన దాఖలాలు కనిపించలేదు. కానీ, సదరు విద్యార్థి నాయకుడు అరెస్ట్ కాగానే.. కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అరెస్ట్ అయిన వ్యక్తి పై సోషల్ మీడియాలో ఫోటోలు తయారుచేసి పోస్టులు పెడుతూ ఆనందం వ్యక్తం చేయడం పలు విమర్శలకు తావిస్తోంది.
తమను ప్రశ్నించారన్న అక్కసుతోనే ఆ యాజమాన్యాలు ఇలా వ్యవహరిస్తున్నాయా..? అన్న అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం నిలబడాలంటే బడుల వ్యవహారాలపై కూడా అధికారులు చట్టపరంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా స్థాయి ఉన్నతాధికారులు , ఆ వివాదాలకు మూలకారణంగా మారుతున్న పాఠశాలల యాజమాన్యాల అక్రమాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించి, సమగ్ర విచారణ జపిస్తే విద్యా దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!
జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్