• ప్రేమ వివాహం ముసుగులో 12 ఏళ్లుగా కొనసాగిన బాగోతం
• కోట్లలో టోకరా వేసి పరారైన ఘరానా మోసగాడు.. కటకటాలపాలైన భార్య
• నాగ్‌పూర్ నుంచి వచ్చిన అల్లుడితో బట్టబయలైన కిలాడీ దంపతుల నిజరూపం
• అసలు భర్తను వదిలేసి.. మరొకరితో కాపురం పెట్టిందిలా!
• నమ్మిన కాలనీవాసులకు షాక్..
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో వెలుగు చూసిన ఒక భారీ మోసపు ఉదంతం స్థానికంగా సంచలనం సృష్టించింది. ప్రేమ పెళ్లి పేరుతో కాలనీలో అడుగుపెట్టిన ఒక జంట, దశాబ్ద కాలంగా అందరినీ నమ్మిస్తూ చిట్టీలు, అప్పుల పేరుతో కోట్లలో టోకరా వేసింది. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా, అతని భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా వారి బంధువులు ఇచ్చిన సమాచారంతో ఈ కిలాడీ దంపతుల బండారం ఒక్కొక్కటిగా బయటపడింది. సుమారు 12 ఏళ్ల క్రితం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన నరేందర్, వైశాలి దంపతులు ఇచ్చోడలోని విద్యానగర్ కాలనీకి వలస వచ్చారు. ఇరువర్గాల పెద్దలు అంగీకరించకపోవడంతో తాము ప్రేమ వివాహం చేసుకుని ఇక్కడకు వచ్చామని కాలనీ వాసులను నమ్మించారు.
మొదట్లో ఓ చిన్న గదిలో కిరాణా దుకాణం ప్రారంభించిన వీరు.. క్రమక్రమంగా దానిని మినీ సూపర్ మార్కెట్లా మార్చారు. వ్యాపారం బాగా సాగుతున్న సమయంలోనే కొత్తగా ‘చిట్టీల వ్యాపారం’ తెరపైకి తెచ్చారు. నమ్మకం కలిగించేలా ప్రవర్తించడంతో స్థానికులు గుడ్డిగా నమ్మి చిట్టీలు కట్టడం ప్రారంభించారు. వ్యాపారం మూడు పూలు.. ఆరు కాయలుగా సాగడంతో మూడేళ్ల క్రితం అదే కాలనీలో రూ.25 లక్షలు వెచ్చించి సొంత ఇల్లు కొనుగోలు చేసి ఘనంగా గృహప్రవేశం కూడా చేశారు. అద్దె ఇంటి నుంచి సొంత ఇంటికి మారడంతో వీరిపై నమ్మకం మరింత బలపడింది. ఇదే అదనుగా భావించిన నరేందర్.. కొందరి వద్ద పెద్ద మొత్తంలో అప్పులు తీసుకుంటూ, ప్రతి నెలా సక్రమంగా వడ్డీ చెల్లిస్తూ అందరినీ మభ్యపెట్టాడు.
చిట్టీల పేరుతో భారీగా డబ్బు వసూలు చేసిన నరేందర్.. ఒక్కసారిగా బోర్డు తిప్పేసి పరారయ్యాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, పది రోజుల క్రితం వైశాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆదిలాబాద్ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా కాలం గడుపుతోంది.
నాగ్‌పూర్ నుంచి అల్లుడి ఎంట్రీ.. అవాక్కయిన కాలనీవాసులు..
జైలుపాలైన వైశాలి తన బంధువులకు సమాచారం అందించడంతో, నాగ్‌పూర్ నుంచి ఆమె రెండో అల్లుడు ఇచ్చోడకు చేరుకున్నారు. ఆయన చెప్పిన విషయాలు విని కాలనీవాసులందరూ అవాక్కయ్యారు.వారిది ప్రేమ వివాహం కాదని, కుటుంబం నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని అల్లుడు స్పష్టం చేశారు. అసలు భర్త రైల్వే ఉద్యోగి: వైశాలికి ఇప్పటికే అసలు భర్త (రైల్వే ఉద్యోగి)తో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నట్లు బంధువులు వెల్లడించారు.పరారైన నరేందర్‌కు కూడా వేరే భార్య, పిల్లలు ఉన్నట్లు తేలింది. పోలీసుల అరెస్ట్ పుణ్యమా అని ఇన్నాళ్లకు వైశాలి అడ్రస్ దొరికిందని, బెయిల్ పై ఆమె బయటకు వస్తేనే మరింత సమాచారం తెలుస్తుందని వారు పేర్కొన్నారు.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో వెంటనే చేరండి!
జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్