• సంగెం చారిటబుల్ ట్రస్ట్ సేవలకు దక్కిన అరుదైన గౌరవం
• దక్షిణాఫ్రికా ఈపీబీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రదానం
• ఘనంగా సత్కరించిన సినీ, సామాజిక ప్రముఖులు
• ఈ పురస్కారంతో మరింత బాధ్యత పెరిగిందన్న డాక్టర్ సుధీర్ కుమార్
వాస్తవ నేస్తం,హైదరాబాద్: ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబం.. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి న్యాయవాదిగా స్థిరపడటమే కాకుండా, సమాజ సేవలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుధీర్ కుమార్ సంగెం.. ఆయన చేస్తున్న నిస్వార్థ సేవలకు గాను తాజాగా అరుదైన ‘గౌరవ డాక్టరేట్’ వరించింది. సుధీర్ కుమార్ తన మాతృమూర్తి స్వర్గీయ గిర్మాబాయ్ జ్ఞాపకార్థం ‘సంగెం చారిటబుల్ ట్రస్ట్’ను నెలకొల్పారు. ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో వినూత్న సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలు, ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆయన సామాజిక సేవలను గుర్తించిన సౌతాఫ్రికా (వెల్లింగ్టన్) కు చెందిన ఈపీబీ (EPB) యూనివర్సిటీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ మరియు ‘వందన యూత్ వాలంటీర్ ఆర్గనైజేషన్’లు సంయుక్తంగా ఆయనకు గౌరవ డాక్టరేట్ డిగ్రీని ప్రకటించాయి.
ప్రముఖుల చేతుల మీదుగా ప్రదానం..
హైదరాబాద్‌లోని తెలంగాణ సర్వత్రిక పరిషత్‌లో ఆదివారం జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో సుధీర్ కుమార్‌కు ఈ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నిర్మాత, దర్శకులు రేలంగి నరసింహారావు, ప్రముఖ సినీ నిర్మాత ఆకుల రమేష్, వందన యూత్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పులి ప్రసాద్, శ్రీ జనార్దన్, శ్రీమతి అభినందన, శ్రీ సుభాష్ గుప్తా తదితరులు హాజరై ఆయనను ఘనంగా సత్కరించారు.
బాధ్యతను పెంచింది..
ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి.. ‘డాక్టర్’ సుధీర్ కుమార్ సంగెంగా ఎదగడం పట్ల తోటి న్యాయవాదులు, ఆయన స్వగ్రామం ఆడేగాం ప్రజలు, జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. ఈ గౌరవ డాక్టరేట్ డిగ్రీ నాపై మరింత సామాజిక బాధ్యతను పెంచింది, భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాను అని పేర్కొన్నారు.
