• ఐదుగురి అరెస్ట్.. ఒకరు పరారీ
• కంప్యూటర్లు, నకిలీ స్టాంపులు స్వాధీనం
• వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : ప్రభుత్వ రికార్డులను నకిలీగా సృష్టించి ప్రజలను, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న భారీ ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ జనన, మరణ, వివాహ ధ్రువపత్రాలతో పాటు ఆధార్, ఓటర్, పాన్ కార్డులు సృష్టించిన ఆరుగురిపై కేసు నమోదు చేయగా, అందులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. గుండాల గ్రామపంచాయతీ కార్యదర్శి మహ్మద్ లుక్మాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇచ్చోడ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితులు గుండాల గ్రామపంచాయతీ కార్యదర్శి పేరుతో నకిలీ రబ్బర్ స్టాంపు తయారు చేసి, ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేశారు. దీని ద్వారా జనన, మరణ, వివాహ ధ్రువపత్రాలు, ఇంటి పన్ను రసీదులు తదితర పత్రాలను కంప్యూటర్లలో నకిలీగా సృష్టించారు. అనంతరం ఈ నకిలీ పత్రాల ఆధారంగా ఆధార్ సంబంధిత పత్రాలు, ఓటర్ గుర్తింపు కార్డులు, పాన్ కార్డులను తయారు చేశారు. అనర్హులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేలా చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని నిలువునా మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఈ కేసులో ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన షేక్ హరూన్ (26), ఇస్లాంపురా కాలనీకి చెందిన అబ్దుల్ షఫీక్ (31), షేక్ దిల్‌షాద్ అహ్మద్ (19), హనుమాన్ కాలనీకి చెందిన అబ్దుల్ రహమాన్ ఖాన్ (20), ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ నౌషాద్ (26) లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు అబ్రార్ అలీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ప్రధాన నిందితుడు తన నేరాన్ని అంగీకరిస్తూ, మిగతా వారి పాత్రను వివరించడంతో పోలీసులు వారి వద్ద నుంచి భారీ ఎత్తున ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ సీపీయూలు, మానిటర్లు, ప్రింటర్లు, హార్డ్‌డిస్క్‌లు, మొబైల్ ఫోన్లు, సుప్రీమా రియల్‌స్కాన్-జీ10 ఫింగర్‌ప్రింట్ స్కానర్, సిఎంఐ టెక్ కెమెరా, లాజిటెక్ వెబ్ కెమెరా తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను, నకిలీ రబ్బర్ స్టాంపులను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించి డిజిటల్ ఆధారాలను సేకరించనున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులు ఇప్పటివరకు ఎంతమంది పేర్లతో ఇలాంటి పత్రాలు రూపొందించారు, ఎవరెవరు వాటిని ఉపయోగించారు, ఇంకా ఎవరైనా ఈ కుట్రలో భాగస్వాములుగా ఉన్నారా అనే కోణంలో లోతైన దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
