HomeCrime Newsఆదిలాబాద్‌లో అంతర్జాతీయ దొంగల ముఠా అరెస్ట్

ఆదిలాబాద్‌లో అంతర్జాతీయ దొంగల ముఠా అరెస్ట్

• పట్టుబడిన ఇద్దరు బంగ్లాదేశీయులు, ఒక భారతీయుడు

• రూ.8 లక్షల విలువైన ఆభరణాలు, వస్తువుల స్వాధీనం

• వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : జిల్లాలోని మావల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసును ఆదిలాబాద్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. సుమారు తొమ్మిదేళ్లుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఒక అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇద్దరు బంగ్లాదేశ్ జాతీయులతో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కేసులో పట్టుబడిన నిందితులను బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్ జిల్లా పర్బతిపూర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్లు మొహమ్మద్ జౌనీ అలీ అలియాస్ జానీ అలీ (30), మొహమ్మద్ రుమాన్ అలీ (33) లతో పాటు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన పండ్ల వ్యాపారి తరుణ్ సింగ్ (29) గా గుర్తించారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు నిందితులు ప్రస్తుతం రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉంటున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ప్రధాన నిందితుడు మొహమ్మద్ జౌనీ అలీ 2015 నుంచి సుమారు తొమ్మిదేళ్లుగా అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి చొరబడుతున్నాడు. ఇలా దాదాపు 10 నుంచి 12 సార్లు సరిహద్దులు దాటి వచ్చి నేరాలకు పాల్పడి తిరిగి వెళ్లినట్లు విచారణలో తేలింది. నకిలీ ఆధార్ కార్డులు సృష్టించుకున్న ఈ ముఠా.. పగటిపూట కుక్కర్లు, గ్రైండర్లు అమ్మే వ్యాపారుల్లా నటిస్తూ కాలనీల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను రెక్కీ నిర్వహిస్తారు. రాత్రి వేళల్లో ఆ ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడతారు. ద్విచక్ర వాహనాలను సైతం ఎత్తుకెళ్తారు. ఇటీవల జూలై 11న అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన ఈ ముఠా.. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మీదుగా ఆదిలాబాద్ చేరుకుని కైలాష్ నగర్‌లోని ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి ఇంట్లో చోరీకి పాల్పడింది.

పోలీసులు నిందితుల వద్ద నుంచి సుమారు రూ. 8 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 73.05 గ్రాముల బంగారం, 151.30 గ్రాముల వెండి, రూ.4,270 నగదు, ఐదు ఐఫోన్లు, రెండు శాంసంగ్ మొబైల్ ఫోన్లు, ఒక ఆపిల్ ఐప్యాడ్ తో పాటు నేరాలకు ఉపయోగించిన ఒక ద్విచక్ర వాహనం ఉన్నట్లు ఎస్పీ వివరించారు.

ప్రధాన నిందితుడు జౌనీ అలీకి ఘనమైన నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇతనిపై 8కి పైగా కేసులు, తరుణ్ సింగ్‌పై 6కి పైగా కేసులు నమోదయ్యాయి. జౌనీ అలీ 2017లో ఒడిశాలో ద్విచక్ర వాహన చోరీ, గృహభేదన కేసులో తొలిసారిగా అరెస్టై జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత 2019లో ఛత్తీస్‌గఢ్‌లో పలువురు అనుచరులతో కలిసి నాలుగు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. 2020లో మధ్యప్రదేశ్‌లో మొబైల్ చోరీ కేసులో జైలు శిక్ష అనుభవించాడు. 2021లో ఛత్తీస్‌గఢ్‌లో, 2022 మరియు 2023 సంవత్సరాల్లో మధ్యప్రదేశ్‌లో వరుసగా ద్విచక్ర వాహన చోరీలు, గృహభేదన కేసుల్లో అరెస్టయ్యాడు. తాజాగా 2026లో బంగ్లాదేశ్ నుంచి రషీదుల్ అనే దళారి సాయంతో అక్రమంగా ప్రవేశించి.. భోపాల్‌లో బైక్, నాగ్‌పూర్‌లో చోరీల అనంతరం ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడి పోలీసులకు చిక్కాడు.

ఈ ముఠాతో సంబంధం ఉండి, ఇదే తరహాలో పనిచేసే మరో 12 నుంచి 15 మంది బంగ్లాదేశ్ వాసుల కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరికి నకిలీ పత్రాలు సమకూర్చిన వారితో పాటు, ఆశ్రయం కల్పించిన వారి పాత్రపై ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ లోతైన దర్యాప్తు చేస్తున్నామన్నారు. దేశ భద్రతకు ముప్పుగా మారే అక్రమ విదేశీయులు, అంతర్రాష్ట్ర నేర ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ భారీ చోరీ కేసును సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో వేగంగా ఛేదించిన మావల సీఐ ప్రేమ్ కుమార్, సైబర్ క్రైమ్ ఎస్ఐ గోపికృష్ణ, క్రైమ్ సిబ్బంది శ్రీనివాస్ తదితరులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular