HomeTrending Newsవరుణుడి కరుణ కోసం.. గాడిదలకు పెళ్లి..!

వరుణుడి కరుణ కోసం.. గాడిదలకు పెళ్లి..!

 * కర్ణాటకలోని మున్యాళ గ్రామంలో వింత ఆచారం

 * అంగరంగ వైభవంగా ‘కాంతేశ్-కస్తూరి’ల కల్యాణం

 * అతిథులకు భారీ విందు భోజనం

 

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: వర్షాలు కురవక, వేసిన పంటలు కళ్లెదుటే ఎండిపోతుండటంతో ఆందోళన చెందిన రైతులు వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఓ వింత ఆచారానికి తెరతీశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ.. ఊరంతా ఏకమై గాడిదలకు అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. ఈ ఆసక్తికర ఘటన కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెళగావి జిల్లా మూడలగి తాలూకాలోని మున్యాళ గ్రామస్తులు అనాదిగా వస్తున్న తమ సంప్రదాయాన్ని పాటిస్తూ ఈ వినూత్న వివాహ తంతును నిర్వహించారు. పెళ్లి కోసం తీసుకొచ్చిన మగ గాడిదకు కాంతేశ్‌ అని, ఆడ గాడిదకు కస్తూరి అని నామకరణం చేసి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అనంతరం వేద మంత్రాల సాక్షిగా, పండితుల సమక్షంలో అత్యంత శాస్త్రోక్తంగా వాటికి వివాహం జరిపించారు. ఈ వేడుకను కేవలం తూతూ మంత్రంగా కాకుండా, అచ్చం మనుషుల పెళ్లి తరహాలోనే బ్యాండ్ బాజాలతో, ఊరంతా కలిసి వైభవంగా నిర్వహించడం గమనార్హం. పెళ్లికి విచ్చేసిన బంధుమిత్రులకు, చుట్టుపక్కల గ్రామస్తులకు భారీ ఎత్తున విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. వర్షాలు ముఖం చాటేయడంతో సాగు చేసిన పంటలన్నీ ఎండిపోతున్నాయి. రైతులు తీవ్ర నష్టాల పాలయ్యే పరిస్థితి నెలకొంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో వరుణ దేవుడిని వేడుకుంటూ.. మా పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం గాడిదలకు వివాహం జరిపించాం. ఈ పెళ్లితోనైనా వరుణుడు కరుణించి, మా గ్రామ పొలిమేరల్లో వానలు కురిపిస్తాడన్న నమ్మకం మాకు ఉంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular