HomeCrime NewsGovt Employees Arrested | అధికార దుర్వినియోగం.. బెదిరింపుల పర్వం..!

Govt Employees Arrested | అధికార దుర్వినియోగం.. బెదిరింపుల పర్వం..!

• కటకటాల పాలైన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు

• మొక్కలు కాలిపోయాయంటూ రైతుల నుంచి రూ.50 వేలు గుంజిన ఫారెస్ట్ బీట్ అధికారి

• ఆర్టీఐ చట్టాన్ని అడ్డుపెట్టుకుని అంగన్‌వాడీ టీచర్‌ను బ్లాక్‌మెయిల్ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

• ఆదిలాబాద్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరి అరెస్ట్, రిమాండ్

అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదు : పోలీసుల కఠిన హెచ్చరిక

 • అధికారాన్ని దుర్వినియోగం చేస్తే శిక్ష తప్పదు

 • బాధితులు నిర్భయంగా ముందుకు రావాలి..

 

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : సామాన్యులకు అండగా ఉండి విధుల్లో పారదర్శకంగా వ్యవహరించాల్సిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు దారి తప్పుతున్నారు. తమకున్న అధికారాన్ని, చట్టాలను అడ్డుపెట్టుకుని సామాన్యులను బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో ఒక అటవీ శాఖ బీట్ అధికారి, మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు.

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల-దేవాపూర్ గ్రామాల మధ్య అటవీ శాఖ ఆధ్వర్యంలో రహదారికి ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. కాగా, కజ్జర్ల గ్రామానికి చెందిన రైతులు తమ పొలాల్లోని పంట అవశేషాలను తగులబెడుతుండగా, ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి కొన్ని మొక్కలకు నష్టం వాటిల్లింది. ఇదే అదనుగా భావించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కృష్ణ నాయక్ రైతులైన చింతలపెల్లి జైభరత్ రెడ్డి, తాండ్ర మహేష్, తాండ్ర నర్సింహులు, యెల్మ రఘువరన్ రెడ్డిలను బెదిరించడం మొదలుపెట్టాడు. పరిహారంగా రూ.1.50 లక్షలు ఇవ్వాలని, లేకపోతే క్రిమినల్ కేసులు పెడతానని భయభ్రాంతులకు గురి చేశాడు. దీంతో భయపడిపోయిన రైతులు జైభరత్ రెడ్డి (రూ.25,000), రఘువరన్ రెడ్డి (రూ.10,000), మహేష్ (రూ.7,500), నర్సింహులు (రూ.7,500) చొప్పున మొత్తం రూ.50 వేలు ముట్టజెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన తలమడుగు ఎస్‌హెచ్‌ఓ డి. రాధిక, నిందితుడు కృష్ణ నాయక్‌ను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సమాచార హక్కు చట్టంతో ఉపాధ్యాయుడి బ్లాక్‌మెయిల్..

సమాచార హక్కు చట్టాన్ని (ఆర్టీఐ) దుర్వినియోగం చేస్తూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంగన్‌వాడీ టీచర్‌ను వేధించిన ఘటన బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. జన్నారం మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సొనాల మండలం ఘన్‌పూర్ గ్రామానికి చెందిన రాథోడ్ రాజు.. అదే గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్ రాథోడ్ విమలను కొద్దిరోజులుగా వేధిస్తున్నాడు. ఆర్టీఐ ద్వారా ఆమె వ్యక్తిగత, ఉద్యోగ వివరాలు సేకరించి, ఉద్యోగం ఊడగొడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఉద్యోగం పోకూడదంటే తనకు రూ.50,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వేధింపులు భరించలేని బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో, ఆమె కుమారుడు శ్రీనివాస్ బోథ్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి నిందితుడు రాథోడ్ రాజును అరెస్ట్ చేశారు. నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించినట్లు బోథ్ సీఐ డి. గురుస్వామి వెల్లడించారు.

అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదు..

ప్రభుత్వ ఉద్యోగులు తమ హోదాను, బాధ్యతలను విస్మరించి చట్టాలను దుర్వినియోగం చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని బోథ్ సీఐ గురుస్వామి, తలమడుగు ఎస్‌హెచ్‌ఓ రాధిక హెచ్చరించారు. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులే రక్షకులుగా కాకుండా భక్షకులుగా మారి సామాన్యులను బెదిరించడం, అక్రమంగా డబ్బులు డిమాండ్ చేయడం క్షమించరాని నేరమని వారు స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.

జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఆర్టీఐ లాంటి చట్టాలను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేసినా, లేక మరే ఇతర పద్ధతుల్లో లంచాలు డిమాండ్ చేసినా బాధితులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు భరోసా కల్పించారు. ఇలాంటి అవినీతిపరుల బారిన పడి మోసపోయిన వారు, వేధింపులు ఎదుర్కొంటున్న వారు నిర్భయంగా, ధైర్యంగా ముందుకు వచ్చి స్థానిక పోలీసులను లేదా జిల్లా పోలీసు ఉన్నతాధికారులను నేరుగా సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, ఫిర్యాదు అందిన వెంటనే సదరు బాధ్యులపై చట్టప్రకారం తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular