HomeCrime Newsడ్రంక్ అండ్ డ్రైవ్‌లో ముగ్గురికి జైలు .. 42 మందికి శిక్షలు ఖరారు చేసిన బోథ్...

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ముగ్గురికి జైలు .. 42 మందికి శిక్షలు ఖరారు చేసిన బోథ్ కోర్టు

• 35 మందికి జరిమానా , నలుగురికి సామాజిక సేవా శిక్ష

• 16 ఓపెన్ డ్రింకింగ్ కేసుల్లోనూ ఫైన్

• నిరంతరం తనిఖీలు కొనసాగుతాయన్న ఇచ్చోడ ఎస్‌హెచ్‌ఓ నరేష్

వాస్తవ నేస్తం,ఇచ్చోడ: మద్యం సేవించి వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ పట్టుబడిన మందుబాబులకు న్యాయస్థానం (Court) భారీ జరిమానాలతో పాటు జైలు శిక్షలు ఖరారు చేసింది. ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడిన వారిని మే 29న కోర్టులో హాజరుపరిచారు. ఇచ్చోడ పోలీసుల తనిఖీల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కింద 42 కేసులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినందుకు (ఓపెన్ డ్రింకింగ్) 16 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను విచారించిన బోథ్ జేఎఫ్‌సీఎం (JFCM) కోర్టు గౌరవ న్యాయమూర్తి కుంబా సందీప్ కుమార్ నిందితులకు శిక్షలు ఖరారు చేశారు. నమోదైన 42 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 35 మందికి జరిమానా విధించగా, మరో నలుగురికి జరిమానాతో పాటు సామాజిక సేవా శిక్షను విధించారు. తీవ్రస్థాయిలో నిబంధనలు ఉల్లంఘించిన కురెలు అశోక్ కుమార్, పెందురే సురేష్, ముండే పరమేశ్వర్ అనే ముగ్గురు వ్యక్తులకు ఒక్కరోజు సాధారణ జైలు శిక్ష విధించారు. అలాగే, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజలకు ఇబ్బందులు కలిగించిన 16 మందికి జరిమానాలు వేశారు.

బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: ఎస్‌హెచ్‌ఓ నరేష్

ఈ సందర్భంగా ఇచ్చోడ ఎస్‌హెచ్‌ఓ నరేష్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు (Road Accidents) జరిగి అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌లపై తమ ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు (Traffic Rules) పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, లేకుంటే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular