Friday, May 29, 2026
HomeCrime Newsadvocate Khaja Moizuddin Mur*der: వక్ఫ్ ఆస్తుల వివాదమే ప్రాణం తీసింది..

advocate Khaja Moizuddin Mur*der: వక్ఫ్ ఆస్తుల వివాదమే ప్రాణం తీసింది..

• 15 లక్షల సుపారీతో అడ్వకేట్ దారుణ హ*త్య..!

• అడ్వకేట్ ఖాజా మోయిజుద్దీన్ హ*త్య కేసును ఛేదించిన పోలీసులు • ఆరుగురు నిందితుల అరెస్ట్, 

• 10 లక్షల నగదు, వాహనం సీజ్

వాస్తవ నేస్తం,హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన అడ్వకేట్ ఖాజా మోయిజుద్దీన్ హ*త్య కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. మొదట రోడ్డు ప్రమాదంగా భావించిన ఈ ఘటన వెనుక భారీ కుట్ర దాగి ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. వక్ఫ్ ఆస్తుల వివాదాల నేపథ్యంలో పాత కక్షలతో ఏకంగా రూ. 15 లక్షల సుపారీ ఇచ్చి, కారుతో గుద్ది అతి కిరాతకంగా ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన కుట్రదారులతో పాటు సుపారీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

మే 23వ తేదీ తెల్లవారుజామున 5:45 గంటల సమయంలో మాసబ్ ట్యాంక్‌లోని తన నివాసం వద్ద లాయర్ ఖాజా మోయిజుద్దీన్ స్విమ్మింగ్ వెళ్లేందుకు కారు వద్దకు రాగా, నంబర్ ప్లేట్ లేని ఓ పచ్చ రంగు మహీంద్రా స్కార్పియో వాహనం వేగంగా వచ్చి ఆయనను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మీటర్ల దూరంలో ఎగిరిపడి తీవ్రంగా గాయపడిన ఆయన.. అబిడ్స్‌లోని ఉదయ్ ఓమ్ని (UDAI Omni) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

మృతుని కుమారుడు ఫర్హాన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నాంపల్లి పోలీసులు.. మొదట ప్రమాదంగా కేసు నమోదు చేశారు. అయితే, సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించగా నిందితులు ఇంటి వద్దే కాపు కాసి, పక్కా స్కెచ్‌తో కారుతో గుద్ది చంపినట్లు స్పష్టమైంది.

కక్ష పెంచుకున్న వైనం..

నిందితుడు ముజాహిద్ ఆలం ఖాన్ కుటుంబానికి, మృతుడు మోయిజుద్దీన్‌కు మధ్య మలక్‌పేట, లక్డీకాపూల్‌లోని వక్ఫ్ ఆస్తుల నిర్వహణపై తీవ్ర వివాదాలు ఉన్నాయి. కొన్నేళ్లుగా వీరి మధ్య సివిల్, క్రిమినల్ కేసులతో పాటు వక్ఫ్ ట్రిబ్యునల్ కేసులు నడుస్తున్నాయి. న్యాయవాది అయిన మోయిజుద్దీన్ చురుగ్గా వ్యవహరిస్తూ కోర్టుల ద్వారా వీరికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చేలా చేస్తున్నాడని కక్ష పెంచుకున్నారు. దీనివల్ల తాము తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్నామని భావించిన నిందితులు, ఆయనను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు.

జనవరి నుంచే రెక్కీ.. రూ. 15 లక్షల సుపారీ..

ముజాహిద్ ఆలం ఖాన్ (A1), అతని తండ్రి మెహబూబ్ ఆలం ఖాన్ (A2) కలిసి ఈ హత్యకు రూ. 15 లక్షల సుపారీ మాట్లాడుకున్నారు. తమ సన్నిహితులు హసన్ అలీ, మునీర్ ద్వారా కిషన్ అలియాస్ పప్పును రంగంలోకి దించారు. కిషన్ తన అనుచరులు వినయ్, విక్రమ్, అభిజిత్‌లతో కలిసి గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. హత్యకు వాడిన స్కార్పియో కొనుగోలు కోసం ముజాహిద్ ఆలం ఖాన్ ముందుగా రూ. 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. 2026 జనవరి నుంచే మోయిజుద్దీన్ కదలికలపై రెక్కీ నిర్వహించిన నిందితులు, సరైన సమయం కోసం వేచి చూసి మే 23న అదను చూసి కారుతో గుద్ది అంతమొందించారు.

పోలీసుల వలలో నిందితులు…

హత్య అనంతరం సాక్ష్యాలను మాయం చేసి వివిధ ప్రాంతాలకు పరారైన నిందితుల కోసం పోలీసులు సాంకేతిక ఆధారాలతో జల్లెడ పట్టారు. సికింద్రాబాద్ లోని పంచవటి లాడ్జ్, నారాయణగూడలోని మెహఫిల్ హోటల్ వద్ద ఉన్న సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కిషన్ గ్యాంగ్‌ను గుర్తించారు. హర్యానాలోని పానిపట్‌లో కిషన్‌ను అదుపులోకి తీసుకోగా అసలు విషయాలు వెలుగుచూశాయి. అతనిచ్చిన సమాచారంతో పోలీసులు కీలక నిందితులను అరెస్ట్ చేశారు.

ముజాహిద్ ఆలం ఖాన్ (A1), మెహబూబ్ ఆలం ఖాన్ (A2): సహ కుట్రదారుడు (తన నివాసంలో అరెస్టు). అభిజిత్ @ నాని (A4): స్కార్పియో కారును నడిపి హత్య చేసిన వ్యక్తి. దిగన్ వినయ్ (A5): హత్యకు ప్రణాళిక వేసి, వాహనాన్ని సమకూర్చిన కీలక వ్యక్తి. విక్రమ్ ఆదిత్య @ చింటు (A8): ప్రణాళిక, నిందితుల సమన్వయంలో సహకరించిన వాడు. మణిదీప్ @ పోగో నాని (A10): హత్య జరిగిన సమయంలో వాహనంలో ఉన్న వ్యక్తి.

అరెస్ట్ చేసిన నిందితుల నుంచి పోలీసులు హత్యకు ఉపయోగించిన పచ్చ రంగు స్కార్పియో వాహనంతో పాటు సుపారీగా అందుకున్న మొత్తంలో రూ.10,10,000 నగదును, పలు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సంచలన కేసును అత్యంత చాకచక్యంగా మరియు ప్రతిభావంతంగా ఛేదించిన అబిడ్స్ ఏసీపీ పి. ప్రవీణ్ కుమార్, నాంపల్లి ఇన్‌స్పెక్టర్ సి.హెచ్ సైదులు, ఎస్ఐ ఆదిల్ రియాజ్ ఖాన్ మరియు వారి సిబ్బందిని హైదరాబాద్ సిటీ పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసుల గాలింపుముమ్మరంగా కొనసాగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular