📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeBusinessGoldGold updates : బంగారం బుల్లిష్ అలర్ట్..! 2026 నాటికి ఔన్సు $6,000 లక్ష్యం :...

Gold updates : బంగారం బుల్లిష్ అలర్ట్..! 2026 నాటికి ఔన్సు $6,000 లక్ష్యం : బ్యాంక్ ఆఫ్ అమెరికా సంచలన అంచనా

అతర్జాతీయ మార్కెట్‌లో బంగారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. రోజురోజుకు పెరుగుతున్న ధరలు సామాన్య వినియోగదారులను భయపెడుతుండగా, పెట్టుబడిదారుల్లో మాత్రం ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక సంస్థలు విడుదల చేస్తున్న అంచనాలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఇప్పటికే గోల్డ్‌మాన్ సాచ్స్ బంగారంపై బుల్లిష్ దృక్పథంతో నివేదిక విడుదల చేయగా, తాజాగా బ్యాంక్ ఆఫ్ అమెరికా (BoA) ఇచ్చిన అంచనాలు మరింత సంచలనంగా మారాయి. వచ్చే ఏడాదిలోనే కాకుండా, 2026 వసంతకాలం నాటికి బంగారం ధర ఔన్సుకు ఏకంగా 6,000 డాలర్లకు చేరే అవకాశం ఉందని BoA స్పష్టం చేసింది. ఇది ఇప్పటివరకు ఏ ప్రధాన ఆర్థిక సంస్థ ఇచ్చిన అత్యంత దూకుడు అంచనాల్లో ఒకటిగా మార్కెట్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రముఖ విశ్లేషకుడు మైఖేల్ హార్ట్‌నెట్ మాట్లాడుతూ.. గతంలో బంగారం బుల్ మార్కెట్ దశల్లో సగటున 43 నెలల వ్యవధిలో దాదాపు 300 శాతం వరకు పెరిగిందని గుర్తుచేశారు. చరిత్ర ప్రతిసారి అదే విధంగా పునరావృతం కాకపోయినా, ప్రస్తుత గ్లోబల్ పరిస్థితులు బంగారానికి మరో భారీ ర్యాలీకి అనుకూలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ లెక్కన చూస్తే 2026 వసంతానికి $6,000 లక్ష్యం అందుబాటులోనే ఉందని BoA భావిస్తోంది.

ఈ బంగారం బలమైన ప్రదర్శనకు పలు కారణాలు ఉన్నాయని బ్యాంక్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెట్టుబడిదారులను సురక్షిత ఆస్తుల వైపు మళ్లిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో బంగారం సంప్రదాయంగా బలమైన హెడ్జ్‌గా పనిచేస్తుందని BoA విశ్లేషణ చెబుతోంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా లోహాల పరిశోధన విభాగాధిపతి మైఖేల్ విడ్మెర్ కూడా 2026 నాటికి పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోల్లో గోల్డ్ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి :  Gold Rate Today: చల్లారుతున్న బంగారం ధరలు.. జనవరి 9 శుక్రవారం పసిడి రేట్లు ఇవే.. తులం ధర ఎంతంటే..

సరఫరా వైపు చూస్తే మరో ఆందోళనకర అంశం కనిపిస్తోంది. ఉత్తర అమెరికాలోని ప్రధాన బంగారు గనుల ఉత్పత్తి 2026లో తగ్గే అవకాశముందని BoA అంచనా వేస్తోంది. అదే సమయంలో గనుల నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఆల్-ఇన్ సస్టైనింగ్ ఖర్చులు ఔన్సుకు సుమారు $1,600 వరకు చేరవచ్చని అంచనా. ఇది ధరల పెరుగుదలకు మరింత ఊతమివ్వనుంది.

డిమాండ్ విషయానికి వస్తే, పెట్టుబడిదారుల ఆసక్తి స్పష్టంగా పెరుగుతోంది. 2025లో బంగారం ఆధారిత ETFలలోకి వచ్చిన పెట్టుబడులు గత కొన్ని సంవత్సరాల్లోనే అత్యధిక స్థాయికి చేరాయి. ముఖ్యంగా రిటైల్ పెట్టుబడిదారులు బంగారాన్ని మళ్లీ తమ పోర్ట్‌ఫోలియోలలో చేర్చుకుంటున్నారు. అయితే అధిక-నికర విలువ గల పెట్టుబడిదారులు మరియు కొన్ని సంస్థాగత ఫండ్స్ ఇంకా బంగారంలో తక్కువ కేటాయింపే కలిగి ఉన్నాయని BoA పేర్కొంది. ఈ విభాగంలో వైవిధ్యీకరణ పెరిగితే, డిమాండ్ మరింత ఉద్ధృతమయ్యే అవకాశం ఉంది. ఇక కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు బంగారం ధరలకు ప్రధాన డ్రైవర్‌గా మారాయి. అనేక దేశాలు తమ విదేశీ నిల్వల్లో గోల్డ్ వాటాను క్రమంగా పెంచుకుంటున్నాయి. డాలర్ ఆధిపత్యంపై పెరుగుతున్న అనిశ్చితి నేపథ్యంలో బంగారం ఒక వ్యూహాత్మక రిజర్వ్ ఆస్తిగా మారుతోంది. రాబోయే కాలంలో కేంద్ర బ్యాంకుల పోర్ట్‌ఫోలియోలలో గోల్డ్ వాటా ఇంకా పెరిగే అవకాశముందని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేస్తోంది.

ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పెరుగుతున్న వేళ సరఫరా ఒత్తిళ్లు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, పెట్టుబడిదారుల ఆసక్తి అన్ని కలిపి చూస్తే గోల్డ్ ర్యాలీ ఇంకా పూర్తిగా మొదలుకాలేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ధరల రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఆచితూచి బంగారంలో పెట్టుబడులు పెట్టడం అంతే ముఖ్యం.

ఇది కూడా చదవండి :  ACB Ride | ఏసీబీ కి చిక్కిన గ్రామ పరిపాలనధికారి

Written by: Qamar SD, Vaasthava Nestham Editorial Team,Published: January 25, 2025 | 21:31 PM

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page