📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeAgricultureప్రతి రైతుకు అవసరాలకు సరిపడా యూరియాను అందించాలి

ప్రతి రైతుకు అవసరాలకు సరిపడా యూరియాను అందించాలి

• వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: రాష్ట్రంలోని ప్రతి రైతుకు పంట అవసరాలకు సరిపడా యూరియా(urea) ను తప్పనిసరిగా అందించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tumi Nageswara Rao)అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో యూరియా పంపిణీపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ (video conference)సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. యాసంగి పంటకు అవసరమైన మేరకు యూరియా నిల్వలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులకు యూరియా పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, ఎరువుల కొరతపై వస్తున్న పుకార్లను రైతులు నమ్మవద్దని సూచించారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోజువారీగా యూరియా ప్రారంభ, ముగింపు నిల్వల వివరాలను తప్పనిసరిగా నివేదించాలని తెలిపారు. త్వరలోనే అన్ని జిల్లాలలో ఫర్టిలైజర్ బుకింగ్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని, ఇకపై ఉదయం 7 గంటలకు కాకుండా ఉదయం 6 గంటల నుంచే యూరియా అమ్మకాలు ప్రారంభించాలని మంత్రి తెలిపారు. యూరియా కొనుగోలుకు వచ్చే రైతులకు టెంటు, త్రాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. యూరియా పంపిణీకి సంబంధించి సమస్యలు ఎదురైతే రాష్ట్రస్థాయి హెల్ప్‌లైన్ నంబర్ 1800 599 5779 ను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పాల్గొని మాట్లాడుతూ, ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను ఈ నెల 22న జిల్లాలో ప్రారంభించామని తెలిపారు. రైతులు, డీలర్లు, వ్యవసాయ అధికారులకు యాప్‌పై వివిధ ప్రసార మాధ్యమాలు, వ్యవసాయ అధికారుల ద్వారా విస్తృత అవగాహన కల్పించామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 4,673 మంది రైతులకు 12,735 బ్యాగుల యూరియాను విక్రయించామని, యాప్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని తెలిపారు. ఎరువుల నిల్వలు, సరఫరాపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి రైతులకు సజావుగా యూరియా అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ఇది కూడా చదవండి :  Indramma Scheme | ఇంద్రమ్మ లబ్ధిదారురాలి భర్తను చెట్టు కట్టేసిన కాంట్రాక్టర్

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ, జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. రైతుల అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న యూరియాను పకడ్బందీగా పంపిణీ చేయాలని సూచించారు. యూరియా కొరతపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పుకార్లను నమ్మవద్దని ఆయన అన్నారు.

మండల స్థాయి వ్యవసాయ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు యూరియా పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని, ఖచ్చితంగా ఉదయం 6 గంటల నుంచే యూరియా అమ్మకాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

 

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, జిల్లా సహకార శాఖ అధికారి మోహన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, మార్క్‌ఫెడ్ డీఎం ప్రవీణ్ రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page