వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: వెనిజులా రాజకీయాలు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అమెరికా కస్టడీలో ఉన్న వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోకు సంబంధించిన బంగారం వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. మదురో పాలన ప్రారంభ దశలో వెనిజులా నుంచి స్విట్జర్లాండ్‌కు భారీ మొత్తంలో బంగారం రహస్యంగా తరలించారన్న అంశం ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది.
కస్టమ్స్ డేటా, అంతర్జాతీయ మీడియా సంస్థలు చేసిన పరిశోధనల ప్రకారం 2013 నుంచి 2016 మధ్య కాలంలో వెనిజులా సెంట్రల్ బ్యాంక్ నుంచి సుమారు113 మెట్రిక్ టన్నుల బంగారం స్విట్జర్లాండ్‌కు చేరినట్లు సమాచారం. అప్పట్లో ఈ బంగారం విలువ దాదాపు 5.2 బిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో సుమారు ₹46,000 కోట్లు.
ఈ తరలింపు జరిగిన సమయంలో వెనిజులా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. చమురు ఆదాయాలు పడిపోవడం, ద్రవ్యోల్బణం అదుపు తప్పడం, విదేశీ కరెన్సీ నిల్వలు క్షీణించడం వంటి కారణాలతో ప్రభుత్వం తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంది. ఈ పరిస్థితుల్లో బంగారు నిల్వలను విక్రయించడం ద్వారానే నిధులు సమకూర్చాలన్న నిర్ణయానికి వచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
స్విస్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ నివేదిక ప్రకారం, అత్యవసర ఆర్థిక అవసరాల కోసమే ఈ బంగారం స్విట్జర్లాండ్‌కు బదిలీ చేసినట్లు అప్పట్లో అధికారికంగా వెల్లడించారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 2017 నుంచి 2025 వరకు స్విట్జర్లాండ్–వెనిజులా మధ్య ఎలాంటి బంగారు లావాదేవీలు జరిగినట్లు
కస్టమ్స్ రికార్డుల్లో ఎక్కడా కనిపించడం లేదు.
మదురో ప్రభుత్వంపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై అమెరికా మదురోను అరెస్టు చేయడంతో
ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. దీనికి కొనసాగింపుగా స్విట్జర్లాండ్ అధికారులు మదురోకు, అతని సన్నిహితులకు సంబంధించిన ఆస్తులను స్తంభింపజేసినట్లు సమాచారం.
అయితే ఈ ఆస్తుల మొత్తం విలువ ఎంత అన్నది ఇంకా వెల్లడికాలేదు. వెనిజులా సెంట్రల్ బ్యాంక్ నుంచి తరలించబడిన బంగారానికి, ఇప్పుడు స్తంభింపజేసిన ఆస్తులకు ఏదైనా సంబంధం ఉందా? అన్న ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ అంశంపై నిపుణుల మధ్య విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి.
సాధారణంగా సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని శుద్ధి చేయడం,
అంతర్జాతీయ ధృవీకరణ పొందడం కోసం స్విట్జర్లాండ్‌కు పంపిస్తుంటాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
అయితే గోల్డ్ మార్కెట్ నిపుణురాలు రోనా ఓ’కానెల్ అభిప్రాయం ప్రకారం, మదురో అధికారంలోకి వచ్చిన తర్వాత వెనిజులా సెంట్రల్ బ్యాంక్ భారీ ఎత్తున బంగారాన్ని విక్రయించింది. ఆ విక్రయాల్లో పెద్ద భాగం స్విట్జర్లాండ్ ద్వారానే జరిగిందని ఆమె పేర్కొన్నారు. కొన్ని లావాదేవీలు బంగారు రూపంలోనే సెటిల్ చేయగా, మిగిలిన బంగారాన్ని చిన్న బిస్కెట్లుగా మార్చి ఆసియా సహా ఇతర ప్రపంచ మార్కెట్లలో విక్రయించినట్లు ఆమె వెల్లడించారు.

ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.
స్తంభింపజేసిన ఆస్తులు ఇంకా ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నాయి. వెనిజులా బంగారం అసలు ఎక్కడికి వెళ్లింది?
మదురో విదేశీ సంపదతో దానికి ఉన్న సంబంధం ఏమిటి?
అన్న ప్రశ్నలు వెనిజులా ఆర్థిక పతనం వెనుక ఉన్న
అతిపెద్ద రహస్యాల్లో ఒకటిగా మిగిలిపోతున్నాయి.
Author: QAMAR SD
