వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ప్రతి ఏటా ఫిబ్రవరి 1వ తేదీ దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే రోజు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ (Budget 2026)పై ఈసారి కూడా సామాన్యుడి నుంచి పారిశ్రామికవేత్తల వరకు భారీ అంచనాలే ఉన్నాయి. జనవరి 28న ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 2 వరకు కొనసాగనున్నాయి. జనవరి 29న ఆర్థిక సర్వే విడుదలైన అనంతరం, ఫిబ్రవరి 1న పూర్తిస్థాయి బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకురానున్నారు.
కానీ ఈ బడ్జెట్ పత్రం ఒక్కరోజులో తయారయ్యేదేమీ కాదు. దీని వెనుక నెలల తరబడి సాగిన కఠిన శ్రమ, కచ్చితమైన లెక్కలు, అత్యంత రహస్య ప్రక్రియ దాగి ఉంటుంది. బడ్జెట్ ఎలా తయారవుతుంది? ఎవరు ఈ లెక్కలన్నింటిని సమన్వయం చేస్తారు? అనే విషయాలు చాలా మందికి తెలియవు.
బడ్జెట్ తయారీ ఎలా మొదలవుతుంది..?
కేంద్ర బడ్జెట్ తయారీకి దాదాపు ఆరు నెలల ముందే ప్రక్రియ ప్రారంభమవుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (DEA) కింద ఉన్న బడ్జెట్ విభాగం ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యత వహిస్తుంది. ఆగస్టు–సెప్టెంబర్ నుంచే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు సర్క్యులర్‌లు పంపిస్తారు.
గత ఏడాది ఖర్చులు, రాబోయే ఆర్థిక సంవత్సరానికి అవసరమైన అంచనాలతో కూడిన వివరాలను ఆయా శాఖలు ఆర్థిక శాఖకు సమర్పిస్తాయి. వాటిని రెవెన్యూ డిపార్ట్‌మెంట్ అధికారులు సవివరంగా పరిశీలిస్తారు. ఆ తర్వాత దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA)తో చర్చించి, బడ్జెట్ లోటు, ఆదాయ మార్గాలు, వ్యయ నియంత్రణపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
ఈ దశ అనంతరం ఆర్థిక మంత్రి పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలు, బ్యాంకర్లు, ట్రేడ్ యూనియన్లతో ప్రీ-బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు. అన్ని వర్గాల అభిప్రాయాలను విన్న తర్వాత ప్రధానమంత్రితో సంప్రదించి బడ్జెట్‌కు తుది రూపు దిద్దుతారు.
హల్వా వేడుక నుంచి గోప్యత వరకు
బడ్జెట్ తయారీలో అత్యంత ఆసక్తికరమైన దశ ‘హల్వా వేడుక’. బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రారంభానికి ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖలో హల్వా వండి, ఈ ప్రక్రియలో పాల్గొనే అధికారులకు వడ్డిస్తారు. ఇది బడ్జెట్ ప్రింటింగ్ అధికారికంగా మొదలైనట్టే సంకేతం.
హల్వా వేడుక అనంతరం బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు సంబంధిత అధికారులు నార్త్ బ్లాక్‌లోనే ఉంటారు. ఫోన్లు, ఇంటర్నెట్ వంటి బాహ్య సంబంధాలు పూర్తిగా నిషేధించబడతాయి. దేశ ఆర్థిక రహస్యాలు లీక్ కాకుండా ఉండేందుకే ఈ కఠిన గోప్యతా నిబంధనలు అమల్లో ఉంటాయి.
రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాతే ఆర్థిక మంత్రి లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 1924 నుంచి 1999 వరకు సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయం ఉండేది. అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం ఆ పద్ధతిని మార్చి ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టడం ప్రారంభించింది.

డిజిటల్ ఇండియా దిశగా అడుగులు వేస్తూ ప్రస్తుతం బడ్జెట్ పత్రాలు పూర్తిగా పేపర్‌లెస్‌గా అందుబాటులోకి వస్తున్నాయి. ఈసారి Budget 2026లో సామాన్యుడికి ఊరట కలిగించే నిర్ణయాలు ఉంటాయా? ఆర్థిక వృద్ధికి కొత్త దారులు చూపుతుందా? అన్నది తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 1 వరకు ఎదురుచూడాల్సిందే.
Author: Qamar SD, Vaasthava Nestham
