📄 ePaper
Monday, May 18, 2026
📄 ePaper
HomeCrime NewsWild boar attack | పంట చేనులో నెత్తుటి చేదు.. వృద్ధురాలిపై అడవి పంది బీభత్సం

Wild boar attack | పంట చేనులో నెత్తుటి చేదు.. వృద్ధురాలిపై అడవి పంది బీభత్సం

• పొలం పనుల్లో ఉండగా విరుచుకుపడ్డ వైనం

• కడుపు భాగంలో తీవ్ర గాయాలు.. బయటకు వచ్చిన పేగులు

• ప్రాణాపాయ స్థితిలో గిరిజన వృద్ధురాలు ఇస్రుబాయి

• హుటాహుటిన ఆసుపత్రికి తరలింపువా

 

 

వాస్తవ నేస్తం,ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అడవి జంతువులు మరోసారి పంజా విసిరాయి. పొట్టకూటి కోసం పంట చేనుకు వెళ్ళిన ఓ గిరిజన వృద్ధురాలిపై అడవి పంది దాడి చేసి బీభత్సం సృష్టించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన బుధవారం ఇచ్చోడ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు మరియు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్చోడ మండలం సల్యాద గ్రామానికి చెందిన ఇస్రుబాయి (78) అనే గిరిజన వృద్ధురాలు బుధవారం ఉదయం తన పంట చేనులో పనులు చేసుకోవడానికి వెళ్లింది. చేనులో పనిలో నిమగ్నమై ఉండగా, పొదల్లో మాటువేసిన అడవి పంది ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగింది. వృద్ధురాలు తేరుకునే లోపే పంది ఆమెను కింద పడేసి విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దాడిలో ఇస్రుబాయి కుడి మోకాలికి మరియు కడుపు భాగంలో తీవ్రమైన గాయాలయ్యాయి. పంది బలంగా కుమ్మివేయడంతో కడుపు భాగం చీరుకుపోయి పేగులు బయటకు వచ్చాయి. దీంతో ఆమె ప్రాణభయంతో గట్టిగా ఆర్తనాదాలు చేసింది. ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల రైతులు, స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతులు కేకలు వేస్తూ అడవి పందిని అక్కడి నుంచి తరిమికొట్టి, ఆమెను ప్రాణాలతో రక్షించారు.

రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధురాలి పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్స్ సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇస్రుబాయి పరిస్థితి విషమంగా ఉండడంతో, ఆమెకు అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. పంట పొలాలకు వెళ్లాలంటేనే రైతులు, కూలీలు భయపడిపోతున్నారని, అటవీ శాఖ అధికారులు స్పందించి అడవి పందుల బెడద నుంచి తమను రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular