📄 ePaper
Friday, April 3, 2026
📄 ePaper
HomeNational newsPulwama Attack | నెత్తుటి మరకలకు నేటితో ఏడేళ్లు.. పుల్వామా అమరవీరులకు దేశం అశ్రునివాళి!

Pulwama Attack | నెత్తుటి మరకలకు నేటితో ఏడేళ్లు.. పుల్వామా అమరవీరులకు దేశం అశ్రునివాళి!

• దేశం కంటతడి పెట్టిన ‘బ్లాక్ డే’

• 40 మంది జవాన్ల బలిదానం 

• ప్రతీకారంతో పాక్‌ వెన్నులో వణుకు పుట్టించిన భారత్ 

• ఆ రోజు అసలేం జరిగిందంటే..?

క్యాలెండర్ లో ఫిబ్రవరి 14 తేదీని చూడగానే ప్రపంచమంతా ‘ప్రేమికుల రోజుగా సంబరాలు చేసుకుంటుంది. గులాబీ పూలు ఇచ్చిపుచ్చుకుంటూ ప్రేమను పంచుకుంటారు. కానీ, గడిచిన ఏడేళ్లుగా (2019 నుంచి) ప్రతి భారతీయుడి గుండెల్లో మాత్రం ఈ తేదీ ఒక చెరగని విషాదాన్ని, అంతులేని ఆవేదనను నింపుతోంది. దేశం కోసం ప్రాణాలర్పించిన 40 మంది వీర జవాన్ల నెత్తుటి మరకలు మన కళ్ళ ముందు మెదుల్ తోనే ఉన్నాయి. జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి నేటితో ఏడేళ్లు పూర్తయ్యాయి. ఆనాటి భయానక ఘటనను, మన జవాన్ల త్యాగాన్ని తలచుకుంటే నేటికీ ప్రతి భారతీయుడి రక్తం మరుగుతుంది. కంటి చెమ్మ ఆరదు. ఆ దాడిలో వీరమరణం పొందిన వీర జవాన్లకు భారతీయ భారత వాణి అశ్రునివాళ్లు అర్పిస్తోంది.

ఆ రోజు అసలేం జరిగింది?

అది 2019, ఫిబ్రవరి 14.. అది మధ్యాహ్న సమయం. కొన్ని రోజులుగా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై మంచు కురుస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఆ రోజు వాతావరణం కాస్త అనుకూలించడంతో, సెలవుల నుంచి తిరిగి విధుల్లో చేరడానికి వెళ్తున్న సుమారు 2,547 మంది జవాన్లతో కూడిన భారీ కాన్వాయ్ జమ్ము నుంచి బయలుదేరింది. ఆ కాన్వాయ్‌లో మొత్తం 78 వాహనాలు ఉన్నాయి. జవాన్లందరూ తమ కుటుంబాలతో గడిపిన తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, తోటి సైనికులతో కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణిస్తున్నారు. సరిగ్గా కాన్వాయ్ పుల్వామా జిల్లాలోని అవంతిపొరా సమీపంలో ఉన్న ‘లెత్‌పొరా’ ప్రాంతానికి చేరుకుంది. అప్పటికే మృత్యువు ఒక కారు రూపంలో వారి కోసం కాచుకుని ఉంది. జవాన్ల బస్సు సమీపంలోకి రాగానే, ఆ కారు వేగంగా బాచి బస్సును ఢీకొంది. అంతే.. ఒక్కసారిగా భారీ విస్ఫోటనం. ఆ శబ్దానికి కొన్ని కిలోమీటర్ల వరకు భూమి కంపించింది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా సైనికుల మాంసపు ముద్దలతో, రక్తపు మడుగులతో నిండిపోయింది. బస్సు తునాతునకలైంది. ఈ దాడిలో 40 మంది భారతమాత ముద్దుబిడ్డలు (CRPF జవాన్లు) అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇది స్వతంత్ర భారత చరిత్రలో భద్రతా బలగాలపై జరిగిన అత్యంత పెద్ద ఉగ్రదాడుల్లో ఒకటి.

ఇది కూడా చదవండి :  Maoist Party | మావోయిస్టు పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ.. లొంగిపోయిన 51 మంది మావోయిస్టులు

12 రోజుల్లోనే ప్రతీకారం: బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్…

ఈ వార్త తెలియగానే దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. టీవీల్లో ఆ దృశ్యాలు చూసి ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు రోడ్లపైకి వచ్చి పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినదించారు. కొవ్వొత్తుల ర్యాలీలతో అమరులకు నివాళులర్పించారు.

ఉగ్రవాదులు తాము చేసిన తప్పుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. దీనికి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో నిర్ణయించే పూర్తి స్వేచ్ఛను సైన్యానికి ఇచ్చి… దేశ ప్రజల ఆగ్రహం, అమరుల కుటుంబాల రోదనలు వృధా పోలేదు. పుల్వామా దాడి జరిగిన 12 రోజుల్లోనే భారత్ తన సత్తా చూపింది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రాంతంలోని ‘బాలాకోట్’లో ఉన్న జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ మెరుపు దాడుల్లో సుమారు 300 మంది ఉగ్రవాదులు, కమాండర్లు హతమైనట్లు సమాచారం. 1971 యుద్ధం తర్వాత భారత విమానాలు పాక్ గగనతలంలోకి ప్రవేశించి దాడి చేయడం ఇదే తొలిసారి. పుల్వామా గాయానికి భారత్ ఇలా గట్టి సమాధానం చెప్పింది.

బాలాకోట్ దాడులతో రగిలిపోయిన పాకిస్థాన్, మరుసటి రోజు (ఫిబ్రవరి 27న) తమ ఎఫ్-16 యుద్ధ విమానాలతో భారత గగనతలంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో జరిగిన డాగ్ ఫైట్ (Dog Fight)లో భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్, తన మిగ్-21 బైసన్ విమానంతో పాక్ అధునాతన ఎఫ్-16ను కూల్చివేశారు. దురదృష్టవశాత్తు ఆయన విమానం కూడా కూలిపోవడంతో పాక్ భూభాగంలో పడిపోయారు. పాక్ సైన్యం ఆయన్ను బందీగా పట్టుకుంది. కానీ, భారత్ దౌత్యపరమైన ఒత్తిడి, అంతర్జాతీయ సమాజం హెచ్చరికలతో పాకిస్థాన్ 60 గంటల్లోనే అభినందన్‌ను క్షేమంగా భారత్‌కు అప్పగించాల్సి వచ్చింది. ఇది భారత్ సాధించిన మరో దౌత్యపరమైన విజయం.

ఇది కూడా చదవండి :  Dr Babasaheb Ambedkar | విశ్వరత్న డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ చరిత్రాత్మక ప్రసంగం

పుల్వామా దాడి జరిగి ఏడేళ్లు గడిచినా, ఆ గాయం ఇంకా పచ్చిగానే ఉంది. ఆ 40 మంది వీరుల కుటుంబాలు పడుతున్న వేదనను మనం తగ్గించలేకపోవచ్చు. కానీ, వారి త్యాగాన్ని స్మరించుకోవడం మన బాధ్యత. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఆ వీరులకు సెల్యూట్ చేద్దాం. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో నిద్రాహారాలు మాని కాపలా కాస్తున్న సైనికులకు అండగా నిలుద్దాం… పుల్వామా అమరవీరులారా.. మీ త్యాగం వృధా పోలేదు. జాతి మొత్తం మీకు రుణపడి ఉంది. జై హింద్!

Note: Images used in this article are generated by AI for representation purposes.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page