📄 ePaper
Thursday, May 21, 2026
📄 ePaper
HomeNational newsలైఫ్ జాకెట్ ఉన్నా ప్రాణం ఎందుకు పోయింది..?

లైఫ్ జాకెట్ ఉన్నా ప్రాణం ఎందుకు పోయింది..?

• కాపాడాల్సిన కవచమే ఉరితాడుగా మారిందా..?

• మృత్యు ఒడిలోనూ వీడని పేగుబంధం.. కన్నీరు పెట్టిస్తున్న తల్లికొడుకుల దృశ్యం!

• పడవ ప్రమాదాల వెనుక అధికారుల నిర్లక్ష్యం.. కాసుల కక్కుర్తే కారణమా..?

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ఒక తల్లి ప్రేమకు మరణం కూడా అడ్డుకట్ట వేయలేకపోయింది. తన ప్రాణాలు పోతున్నా సరే.. తన బిడ్డను రక్షించుకోవాలన్న ఆ తల్లి తపన యావత్ దేశాన్ని కన్నీరు పెట్టిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటో చూస్తే ఎంతటి కఠినాత్ముడికైనా కళ్లు చెమ్మగిల్లక మానవు. ముంచుకొస్తున్న మృత్యువుకు భయపడి ఆ చిన్నారి ఏడవకుండా.. “నేనున్నాను నాన్నా” అన్నట్లు తన చేతులతో బిడ్డను గట్టిగా గుండెలకు హత్తుకుంది ఆ తల్లి. మరణంలోనూ ఆ పేగుబంధం వీడలేదు. ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా.. ఆ తల్లి చేతుల్లో ఆ చిన్నారి బందీ అయి, ప్రశాంతంగా అమ్మ ఒడిలో నిద్రపోతున్నట్లుగా ఉన్న ఆ దృశ్యం ఇప్పుడు ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేస్తోంది.

ఈ హృదయవిదారక ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రం జబల్‌పూర్ జిల్లాలోని బర్గి డ్యామ్‌ (నర్మదా నది) వద్ద చోటుచేసుకుంది. నీటి అలలపై సాగిన ఆనందాల ప్రయాణం అనంతలోకాలకు దారి తీసింది. విహారయాత్ర కాస్తా విషాదాంతమై నిండు ప్రాణాలు జలసమాధి అయ్యాయి. సుమారు 30 నుంచి 40 మంది పర్యాటకులతో వెళ్తున్న క్రూయిజ్ బోటు అకస్మాత్తుగా వచ్చిన తుఫాను, ఈదురుగాలుల ధాటికి అదుపుతప్పి బోల్తా పడింది.

పడవ ప్రమాదాలు జరిగినప్పుడల్లా అయ్యో పాపం అని జాలి పడటం సహజమే.. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరి మదిని తొలిచే, వ్యవస్థను నిలదీసే అతిపెద్ద ప్రశ్న ఒక్కటే..! నీటిలో మునిగిపోయి విగతజీవులుగా మారిన ఆ తల్లికొడుకుల ఒంటిపై ‘లైఫ్ జాకెట్లు’ ఉన్నాయి కదా..? మరి వారు ఎలా చనిపోయారు.? ప్రాణాలు కాపాడాల్సిన లైఫ్ జాకెట్ వేసుకున్నా నీటిలో ఎలా మునిగిపోయారు..? ఇది కేవలం ప్రకృతి చేసిన ప్రమాదమా.. లేక అధికారుల నిర్లక్ష్యం, నిర్వాహకుల కక్కుర్తికి నిలువునా బలైపోయిన మరో హత్యనా..?

నిబంధనల ప్రకారం ఒక పడవలో ఎంతమంది ఎక్కాలి..? ఎంత బరువు ఉండాలి..? అన్న లెక్కలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి. ట్రిప్పుల సంఖ్య పెంచుకోవాలన్న నిర్వాహకుల ధనదాహం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్లే పడవలు అదుపు తప్పి బోల్తా పడుతున్నాయి. బ్యాలెన్స్ కోల్పోయి పడవ మునిగిపోతున్న ఆ క్షణంలో.. భయంతో జనం అంతా ఒకే వైపుకు రావడం వల్ల సెకన్ల వ్యవధిలోనే ఘోరం జరిగిపోతోంది. బోటు కింది భాగంలో నీళ్లు నిండిపోతున్నప్పుడు, ఊపిరాడక బయటకు రాలేని పరిస్థితుల్లో ఆ తల్లి తన బిడ్డ కోసం తన దేహాన్నే ఓ కవచంగా మార్చింది. ఇక్కడ ప్రకృతిని నిందించడం కంటే, ఓవర్ లోడింగ్ కు అనుమతిస్తున్న నిర్వాహకులదే అసలు తప్పు.

Heartbreaking scene of Jabalpur boat accident where mother holds son
Despite wearing life jackets, the tragic Jabalpur boat accident claimed the lives of a mother and her young son.

లైఫ్ జాకెట్ ఉన్నా ఎందుకు చనిపోయారు..?

సాధారణంగా లైఫ్ జాకెట్ ధరిస్తే, మునిగిపోకుండా నీటిపై తేలుతారు. సహాయం అందేవరకు బతికే అవకాశాలు నూటికి తొంభై శాతం ఉంటాయి. మరి ఇక్కడ అలా ఎందుకు జరగలేదు..? దీని వెనుక ఉన్న చేదు నిజాలు ఆలోచిస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. పడవల్లో పర్యాటకులకు ఇస్తున్న లైఫ్ జాకెట్లు ప్రామాణికమైనవా? లేక రంగుల క్లాత్ లోపల చౌకబారు థర్మాకోల్ నింపిన నాసిరకం వస్తువులా? ఒక మనిషి బరువును ఆపి, కాపాడే సామర్థ్యం ఆ జాకెట్లకు ఉందా లేదా అన్నది ఎవరు చెక్ చేయాలి..? లైఫ్ జాకెట్ ను కేవలం చొక్కాలా ఒంటికి తగిలించుకుంటే సరిపోదు. దానికి ఉన్న బెల్టులను లాక్ చేసి గట్టిగా బిగించాలి. లేదంటే నీటిలో పడగానే జాకెట్ పైకి వచ్చేస్తుంది, మనిషి బరువుకు కిందికి మునిగిపోతాడు. ఈ కనీస సూచనలు పడవ ఎక్కేముందు ప్రయాణికులకు సిబ్బంది చెబుతున్నారా? అంటే కచ్చితంగా ‘లేదు’ అనే సమాధానం వస్తుంది. చాలా పర్యాటక ప్రాంతాల్లో పదేళ్ల నాటి లైఫ్ జాకెట్లనే ఇంకా వాడుతున్నారు. వాటికి స్ట్రాప్స్ ఉండవు, క్లిప్పులు పనిచేయవు, దారాలతో కట్టుకునే పరిస్థితి. కేవలం అధికారుల తనిఖీల సమయంలో “మా దగ్గర జాకెట్లు ఉన్నాయి” అని చూపించుకోవడానికి మాత్రమే వాటిని వాడుతున్నారు. ఆ నకిలీ కవచాలే ఇప్పుడు అమాయకుల ప్రాణాలు తీస్తున్నాయి.

ఇది ముమ్మాటికీ వ్యవస్థ వైఫల్యమే..!

ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రెండు రోజులు హడావుడి చేయడం, ఆ తర్వాత మామూలే అన్నట్టుగా వ్యవహరించడం అధికారులకు పరిపాటిగా మారింది. పర్యాటక శాఖ, పోలీసుల పర్యవేక్షణ ఎక్కడుంది? లైఫ్ జాకెట్ల నాణ్యతను ఎప్పటికప్పుడు ఎందుకు తనిఖీ చేయడం లేదు? పరిమితికి మించి జనాలను ఎక్కిస్తున్నా.. చూసీచూడనట్లు వదిలేయడం వల్లే ఇలాంటి అమాయకపు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. లైఫ్ జాకెట్ అంటే కేవలం పడవలో పెట్టుకునే ‘షో పీస్’ కాదు.. అదొక ప్రాణరక్షణ కవచం. బర్గి డ్యామ్ లో జరిగిన ఈ సంఘటన భవిష్యత్తు ప్రమాదాలకు ఒక హెచ్చరిక లాంటిది. మృత్యువులోనూ బిడ్డను వదలని ఆ తల్లి దీనస్థితి చూశాకైనా నిద్రపోతున్న వ్యవస్థ మేల్కొనేది ఎప్పుడు..? ఇప్పటికైనా నిబంధనలు కఠినంగా అమలు చేయకపోతే.. రేపు ఇంకెన్ని కుటుంబాలు వీధిన పడాలో?!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular