– తల్లిదండ్రులకు తెలియకుండా రూయ్యడి నుంచి ఆదిలాబాద్‌కు తరలింపు
– నిందితురాలు నైతం నాగుబాయిపై కేసు నమోదు
– గాలింపు కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలు
– ఆచూకీ తెలిపితే నగదు బహుమతి: ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఆడుకుంటూ ఉన్న ఓ నాలుగేళ్ల చిన్నారిని అదే గ్రామానికి చెందిన ఓ మహిళ కిడ్నాప్ చేసి, పట్టణంలోని బస్టాండ్‌లో గుర్తుతెలియని వ్యక్తులకు అప్పగించిన ఘటన కలకలం రేపుతోంది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రూయ్యడి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత తల్లి ఫిర్యాదు మేరకు నిందితురాలిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళితే..
రూయ్యడి గ్రామానికి చెందిన ఆత్రం కప్లిబాయి కూతురు ఆత్రం గంగామణి (4)ని, అదే గ్రామానికి చెందిన నిందితురాలు నైతం నాగుబాయి సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తల్లిదండ్రులకు తెలియకుండా మాయమాటలు చెప్పి తీసుకువెళ్లింది. నేరుగా ఆదిలాబాద్ పట్టణానికి చేరుకుని, బస్టాండ్ వద్ద చిన్నారిని ఇతరులకు అప్పగించింది. పాప కనిపించకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు అంతటా గాలించారు. చివరికి నాగుబాయే తమ బిడ్డను తీసుకెళ్లిందని తెలుసుకున్న తల్లి కప్లిబాయి.. మంగళవారం తలమడుగు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో నిందితురాలు ఆదిలాబాద్, తాంసి బస్టాండ్ పరిసరాల్లో సంచరించినట్లు గుర్తించి, అక్కడి సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఫుటేజీలో నిందితురాలు చిన్నారితో కలిసి ఉన్నట్లు నిర్ధారించారు.

ఆచూకీ తెలిపితే నగదు బహుమతి..
కిడ్నాప్‌కు గురైన చిన్నారి గంగామణికి నాలుగేళ్లు ఉంటాయని, కోలాం భాషతో పాటు కొద్దిగా తెలుగు మాట్లాడుతుందని డీఎస్పీ తెలిపారు. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి తగిన నగదు బహుమతి అందజేస్తామని ఆయన ప్రకటించారు. పాపను గుర్తించిన వారు వెంటనే తల్లిదండ్రులకు లేదా దగ్గరలో ఉన్న పోలీసులకు, లేదంటే డయల్ 100 ద్వారా సమాచారం అందించాలని కోరారు. లేదా సమాచారాన్ని తలమడుగు ఎస్ఐ 87126 59928 , ఆదిలాబాద్ రూరల్ సీఐ 87126 59915 , ఆదిలాబాద్ డీఎస్పీ 87126 59914 లకు ఇవ్వాలని పోలీసులు కోరారు.
