• టోల్ ప్లాజా సిబ్బందిని కంటైనర్‌తో ఢీకొట్టి యత్నం
• 47 పశువులు, కంటైనర్ లారీ, గంజాయి స్వాధీనం
• ఆరుగురు నిందితుల రిమాండ్, మరో ముగ్గురి కోసం గాలింపు
• వివరాలు వెల్లడించిన ఇచ్చోడ రూరల్ సీఐ రమేష్
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : అమాయక మూగజీవాలను అక్రమంగా తరలించడమే కాకుండా, వారిని అడ్డుకునేందుకు యత్నించిన టోల్ ప్లాజా సిబ్బందిపైకి వాహనాలను ఎక్కించి హత్యాయత్నానికి పాల్పడిన ఓ అంతర్రాష్ట్ర పశువుల అక్రమ రవాణా ముఠాను ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నుంచి 47 పశువులతో పాటు ఒక కంటైనర్ లారీ, గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఇచ్చోడ రూరల్ సీఐ రమేష్ వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ప్రాంతం నుంచి నిజామాబాద్ జిల్లా సతాపూర్ వైపు ఒక ముఠా అక్రమంగా పశువులను కంటైనర్ లారీలో రవాణా చేస్తోంది. పోలీసుల తనిఖీలను ముందుగానే పసిగట్టేందుకు ఈ కంటైనర్ లారీకి ముందు ఓ మహీంద్రా బొలెరో వాహనాన్ని పైలట్‌గా ఉపయోగిస్తూ డ్రైవర్‌కు సమాచారం ఇస్తున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం నేరడిగొండ మండలంలోని రోల్‌మామడ టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్న ఈ వాహనాలను సిబ్బంది నిలిపేందుకు ప్రయత్నించారు. అయితే, ముఠా సభ్యులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బొలెరో వాహనంతో టోల్ గేట్లను ఢీకొట్టి అత్యంత వేగంగా ముందుకు దూసుకెళ్లారు. ఆ వెనుకే వస్తున్న కంటైనర్ లారీ కూడా టోల్ సిబ్బంది ఏర్పాటు చేసిన సైన్ కోన్లు, డివైడర్లను ఢీకొట్టి బీభత్సం సృష్టించి అక్కడి నుంచి పరారైంది. సిబ్బందిపైకి ఉద్దేశపూర్వకంగా వాహనాలు ఎక్కించి ప్రాణాపాయం కలిగించేలా వ్యవహరించడంతో, టోల్‌ప్లాజా సూపర్‌వైజర్ ఫిర్యాదు మేరకు నేరడిగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ దర్యాప్తులో భాగంగా సెప్టెంబర్ 3వ తేదీ తెల్లవారుజామున కుంటాల గ్రామ శివారులో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా పశువుల అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వారు ఇచ్చిన పక్కా సమాచారంతో ఆదిలాబాద్‌లో తలదాచుకున్న మిగిలిన ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో ఆదిలాబాద్‌కు చెందిన ఎండి. షఫీ ముదస్సిర్, గోపాల్ సింగ్ షెకావత్ లతో పాటు మహారాష్ట్రకు చెందిన ఫిర్దోస్ బెగ్, మహమ్మద్ హైదర్ అలీ, క్షితిజ్ భీమ్‌రావు సేవట్కర్, సందీప్ విఠల్ ముప్పిడివార్ ఉన్నారు.
వీరి వద్ద నుంచి 24 ఎద్దులు, 23 ఆవులను (మొత్తం 47 పశువులు) స్వాధీనం చేసుకున్నారు. అయితే, అక్రమ రవాణా సమయంలో ఇరుకుగా తరలించి హింసించడం వల్ల మూడు పశువులు మృతి చెందగా, మిగిలిన 44 పశువులను పోలీసులు సురక్షితంగా గోశాలకు తరలించారు. వీటితో పాటు ఒక కంటైనర్ లారీ, మూడు మొబైల్ ఫోన్లు, మూడో నిందితుడు మహమ్మద్ హైదర్ అలీ వద్ద నుంచి 4 గ్రాముల గంజాయిని సైతం సీజ్ చేశారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు (మహమ్మద్ మజార్, రాజు, రవి జగదీష్) పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. అరెస్టయిన ఆరుగురు నిందితులపై నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రజల భద్రతకు ముప్పు కలిగించేలా వాహనాలు నడపడం, పశువుల అక్రమ రవాణా, మాదకద్రవ్యాల సరఫరాకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!
జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్