HomeTelanganaAdilabadజారి పడితే ప్రాణాలు అవుట్..!!

జారి పడితే ప్రాణాలు అవుట్..!!

• నరకప్రాయంగా అడిగామా(కే) – సోనాల అంతర్రాష్ట్ర రహదారి

 * చినుకు పడితే చాలు.. బురదమయంగా మారుతున్న రోడ్డు

 * గుంతలమయంగా మారిన మార్గం.. నిత్యం ప్రమాదాలు

 * పట్టించుకోని అధికారులు.. గ్రామస్తుల తీవ్ర ఆందోళన

 

వాస్తవ నేస్తం,ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని అడిగామా(కే) గ్రామం నుంచి సోనాల మండలానికి వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి పరిస్థితి అద్వానంగా మారింది. ఏళ్ల తరబడిగా రోడ్డు మరమ్మతులకు నోచుకోకపోవడంతో భారీ గుంతలు ఏర్పడి, ప్రయాణికులకు నిత్యం ప్రమాదకరంగా పరిణమించింది. వాహనాలు అదుపుతప్పి గుంతల్లో పడిపోతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ రహదారి గుండా ప్రయాణించాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా రోడ్డంతా బురదమయంగా మారి చిత్తడిగా తయారవుతోంది. వర్షపు నీరు నిలిచిపోయి గుంతలు ఎక్కడున్నాయో కనపడకపోవడంతో ద్విచక్ర వాహనదారులు కిందపడి తీవ్ర గాయాల పాలవుతున్నారు. ప్రతిరోజూ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, విధులకు హాజరయ్యే ఉద్యోగులు, రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా అత్యవసర వైద్య సేవల కోసం ప్రయాణించే రోగుల పరిస్థితి అయితే వర్ణనాతీతంగా మారింది.

అధికారుల నిర్లక్ష్యంపై పెల్లుబుకుతున్న ఆగ్రహం..

ఈ అంతర్రాష్ట్ర రహదారిపై ప్రతిరోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న రోడ్డు దెబ్బతిని నామమాత్రంగా మారినా, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడం పట్ల గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “పెద్ద ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే వరకు అధికారులు స్పందించరా?” అని ప్రజలు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ రహదారిపై ప్రయాణం అంటేనే అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు వెంటనే నిద్ర వీడి, తక్షణమే స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని, ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని అడిగామా(కే) గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular