మా ఊర్లోకి బస్ రావద్దు అన్న ఏకైక గ్రామం ఇచ్చోడ (దేశంలో) ఒక్కటే ఎందుకు ?
- • సోషల్ మీడియాలో ప్రజా ప్రతినిధుల స్టేటస్‌ల వైరల్**
- • పేరుకే పెద్ద మండలం.. ఊరి ముఖం చూడని ఆర్టీసీ బస్సులు**
- • మూడు నెలలుగా నరకం.. మండుటెండల్లో ప్రయాణికుల అవస్థలు**
- • అసలు కారణమేంటి..? రాజకీయమా.. లేక టార్గెట్టా..?
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: “మా ఊర్లోకి బస్ రావద్దు అన్న ఏకైక గ్రామం (దేశంలో) ఇచ్చోడ ఒక్కటే ఎందుకు?” ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఎక్కడ విన్నా ఇదే చర్చ! సాక్షాత్తూ స్థానిక ప్రజా ప్రతినిధులే సోషల్ మీడియా వేదికగా ఈ విధమైన స్టేటస్‌లు పెడుతుండటం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఒక ఊరికి బస్సు రావాలని జనం ధర్నాలు చేస్తారు, కానీ బస్సు రావొద్దని అడ్డుకునే పరిస్థితి (లేదా బస్సులు రాకుండా చేసే వాతావరణం) ఒక్క ఇచ్చోడలోనే ఎందుకు నెలకొంది? అన్న ప్రశ్న ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ స్టేటస్‌లు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి.
పేరుకే పెద్ద మండలం..
ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ పేరుకే అతిపెద్ద మండలం. వ్యాపార, వాణిజ్య, విద్యా పరంగా ఎంతో కీలకమైన ఈ మండల కేంద్రంలోకి ఆర్టీసీ బస్సులు రాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఏ ఊరికైనా బస్టాండ్ ఆ ఊరి నడిబొడ్డున ఉంటుంది, బస్సులు అక్కడికి వచ్చి వెళుతుంటాయి. కానీ, ఇచ్చోడ విషయంలో మాత్రం ఈ సమీకరణం మారిపోయింది. బస్సులు ఊరి లోపలికి రాకుండా బైపాస్ మీదుగా లేదా ఊరి బయటే ప్రయాణికులను వదిలేసి వెళ్లిపోతున్నాయి. గత మూడు నెలలుగా ఇదే దుస్థితి కొనసాగుతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
మండుటెండల్లో అగచాట్లు..
ఒకపక్క భానుడు భగభగ మండుతున్నాడు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఈ మండుటెండల్లో ప్రయాణికుల పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. బస్సులు ఊర్లోకి రాకపోవడంతో మహిళలు, వృద్ధులు, పసిపిల్లలతో పాటు బరువైన సామాన్లు మోసుకుంటూ కిలోమీటర్ల మేర నడవాల్సిన నరకం నెలకొంది. ఆసుపత్రులకు వెళ్లే రోగులు, నిత్యం రాకపోకలు సాగించే విద్యార్థులు, బతుకుదెరువు కోసం తిరిగే చిరు వ్యాపారులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. ప్రయాణ బరువు కంటే, బస్సు దిగి ఇంటికి చేరుకునే దూర భారంతోనే జనం సతమతమవుతున్నారు.
రాజకీయమా..? లేక ఉద్దేశపూర్వక టార్గెట్టా..?
ఇంత జరుగుతున్నా ఎందుకు ఎవరూ స్పందించడం లేదు? అసలు ఇచ్చోడలోకి బస్సులు రాకపోవడానికి కారణమేమిటి? దీని వెనుక ఏదైనా రాజకీయ కుట్ర దాగి ఉందా? బస్సులు లోపలికి వస్తే ట్రాఫిక్ సమస్యలు వస్తాయని కొందరు కావాలనే అడ్డుకుంటున్నారా? లేక ఉద్దేశపూర్వకంగానే ఎవరైనా ఇచ్చోడను టార్గెట్ చేశారా? లేదా గతంలో కొన్ని గరిగిన ఘటన వల్ల కావాలనే టార్గెట్ చేస్తున్నారా..? అన్న అనుమానాలు సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రజా ప్రతినిధులు సైతం నేరుగా రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించాల్సింది పోయి, ఇలా వాట్సాప్ స్టేటస్‌లు పెట్టి ఆవేదన వ్యక్తం చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? పైస్థాయిలో ఉన్న ఒత్తిళ్ల వల్ల వారు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నారా? అన్నది తేలాల్సి ఉంది.
కారణాలు ఏవైనా.. వ్యక్తుల లేదా రాజకీయాల ప్రయోజనాల కోసం సామాన్యులు సమిధలు కాకూడదు. “మా ఊరికి బస్సు రావొద్దు” అనే వింత పరిస్థితి నుంచి పాత రోజుల్లాగే ఆర్టీసీ బస్సులు ఊరి లోపలికి వచ్చేలా భరోసా కల్పించాల్సిన బాధ్యత అధికారులపై, స్థానిక నాయకులపై ఉంది. లేదంటే ఈ వేసవి తాపానికి తోడు, ప్రజల ఆగ్రహ జ్వాలలు కూడా తోడైతే పరిస్థితి తీవ్రంగా మారే ప్రమాదం ఉంది.

