HomeCrime Newsఒకే ప్లాటు.. మూడు రిజిస్ట్రేషన్లు.. నకిలీ పత్రాలతో కబ్జాకు యత్నించిన ముఠా అరెస్ట్

ఒకే ప్లాటు.. మూడు రిజిస్ట్రేషన్లు.. నకిలీ పత్రాలతో కబ్జాకు యత్నించిన ముఠా అరెస్ట్

• ఇంటి ఫొటోలు, అసలు హద్దులతో నకిలీ పత్రాల సృష్టి

• పత్రాలు వెనక్కి తీసుకోవాలంటే డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్

• ఎనిమిది మందిపై కేసు.. నలుగురు నిందితుల అరెస్ట్, పరారీలో మరో నలుగురు

• వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి

 

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : స్థల యజమాని పత్రాలను దుర్వినియోగం చేస్తూ, ఒకే ప్లాటుపై ఏకంగా మూడు రిజిస్ట్రేషన్లు సృష్టించి స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన ఓ ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా మావల పోలీసులు రట్టు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా, వాటిని రద్దు చేసుకోవాలంటే డబ్బులు ఇవ్వాలంటూ అసలు యజమానినే డిమాండ్ చేసిన ఈ ఘటనలో ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి వెల్లడించారు.

డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్, పిట్టలవాడ ప్రాంతంలో సర్వే నంబర్ 21/3లో గల ప్లాట్ నంబర్ 14లో ఫిర్యాదుదారుడికి 30×50 అడుగుల స్థలం ఉంది. ఆ స్థలాన్ని 2022లో కొనుగోలు చేసి తన ఆధీనంలో ఉంచుకున్నాడు. అయితే, ప్రధాన నిందితుడు కాకడే నాందేవ్ తన అనుచరులతో కలిసి ఆ స్థలంపై కన్నేశాడు. ప్లాట్ నంబర్ 8కి సంబంధించిన వివరాలను ఉపయోగించి నకిలీ రెవెన్యూ పట్టా, గ్రామపంచాయతీ పన్ను రసీదులు సృష్టించాడు. అసలు స్థలం 30×50 అడుగులు ఉండగా, నకిలీ పత్రాల్లో మాత్రం 30×40 అడుగులుగా చూపిస్తూ, బాధితుడికి చెందిన అసలు స్థలం హద్దులనే అందులో పొందుపరిచి రిజిస్ట్రేషన్ అధికారులను సైతం తప్పుదోవ పట్టించారు. ఈ నకిలీ పత్రాలతో ఒకటికి మూడుసార్లు రిజిస్ట్రేషన్లు చేసి ఆ స్థలంపై తప్పుడు హక్కులు కల్పించుకునే ప్రయత్నం చేశారు. ఇంతటితో ఆగని నిందితులు, తాము సృష్టించిన నకిలీ పత్రాలను ఉపసంహరించుకోవాలంటే లక్షా అరవై వేల రూపాయలు ఇవ్వాలని అసలు యజమానిని బెదిరించారు. వారి బెదిరింపులకు భయాందోళనకు గురైన బాధితుడు తొలుత వారికి పది వేల రూపాయలు కూడా చెల్లించాడు. ఆ తర్వాత బాధితుడి ఫిర్యాదు మేరకు మావల పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఈ వ్యవహారంలో పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు.. బుధవారం నాడు కేఆర్కే కాలనీకి చెందిన కాకడే నాందేవ్, షేక్ ముబారక్, రిక్షా కాలనీకి చెందిన మేకల సూర్యకిరణ్, ఇందిరమ్మ కాలనీకి చెందిన సూరం శ్రీయం లను అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో సభ్యులైన మరో నలుగురు నిందితులు అర్చన వాగ్మారే, సంతోష్ కుమార్ ఎప్పర్, దేవకీ బాయి గట్టు, మేకల మల్లన్న ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని డీఎస్పీ పేర్కొన్నారు.

ఇతరుల ఆస్తులపై కన్నేసి నకిలీ పత్రాలు సృష్టించడం, అక్రమంగా హక్కులు పొందాలని చూడటం, బెదిరింపులకు పాల్పడటం లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ జీవన్ రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రజలు తమ ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలు, రిజిస్ట్రేషన్ వివరాలను అత్యంత భద్రంగా ఉంచుకోవాలని, ఎలాంటి అనుమానాస్పద లావాదేవీలు లేదా నకిలీ పత్రాల వ్యవహారాలు దృష్టికి వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. ఈ కేసును మావల సీఐ బీడీ ప్రేమ్ కుమార్, ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో విచారిస్తున్నట్లు వెల్లడించారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!

జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్
RELATED ARTICLES
- Advertisment -

Most Popular