HomeBreaking Newsనకిలీ పత్తి విత్తనాల అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు.. రూ. 20 లక్షల సరుకు సీజ్

నకిలీ పత్తి విత్తనాల అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు.. రూ. 20 లక్షల సరుకు సీజ్

• హైదరాబాద్ కేంద్రంగా దందా.. గుజరాత్ నుంచి సరఫరా

• ఇచ్చోడలో పట్టుబడిన నకిలీ రాయుళ్లు.. డీలర్ ఈశ్వర్, సప్లయర్ గిరీష్ పటేల్ అరెస్ట్

• ఆదిలాబాద్ టూటౌన్ పీఎస్ లో 9 మందిపై కేసు నమోదు

• వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, వారి ప్రాణప్రదమైన వ్యవసాయాన్ని దెబ్బతీస్తూ అక్రమంగా కోట్లు గడించాలనుకున్న ఒక భారీ అంతర్రాష్ట్ర నకిలీ పత్తి విత్తనాల ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఛేదించారు. గుజరాత్ నుంచి నకిలీ విత్తనాలు తెప్పించి, హైదరాబాద్ కేంద్రంగా ఉమ్మడి ఆదిలాబాద్, మహారాష్ట్రల్లోని రైతులకు అంటగడుతున్న ఈ ముఠాలోని ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.

హైదరాబాద్ కొత్తపేటకు చెందిన పాపిన్వార్ సునీల్ కుమార్‌ను ఈ కేసుకు ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. 2008 నుంచి వివిధ సీడ్స్ కంపెనీల్లో సేల్స్‌మెన్‌గా పనిచేసిన సునీల్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు, ఫర్టిలైజర్ దుకాణదారులతో పరిచయాలు పెంచుకుని ‘నితీక్ష అగ్రిటెక్’, ‘జీనియస్ క్రాప్ సైన్సెస్’ పేర్లతో కంపెనీలు స్థాపించాడు. వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవడంతో గుజరాత్‌లోని ఇదార్‌కు చెందిన గిరీష్ పటేల్ నుంచి గత నాలుగేళ్లుగా నకిలీ పత్తి విత్తనాలు తెప్పించి ఏజెంట్ల ద్వారా విక్రయిస్తున్నాడు. వ్యవసాయ అధికారి ఫిర్యాదుతో ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా.. పట్టణంలోని ఒక గోడౌన్లో ఏకంగా 750 నకిలీ విత్తన ప్యాకెట్లు లభ్యమయ్యాయి.

ఇచ్చోడ కేంద్రంగా నకిలీ దందా.. అరెస్టయిన నిందితులు వీరే..

ఈ అంతర్రాష్ట్ర నకిలీ విత్తనాల దందాలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేంద్ర బిందువుగా మారినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం తొమ్మిది మందిపై ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ప్రధాన నిర్వాహకుడు సునీల్ కుమార్‌తో పాటు విత్తనాలను తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన రాథోడ్ పండిత్, రాథోడ్ బాలాజీలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ దందాకు ముఖ్య సరఫరాదారుడైన గుజరాత్‌కు చెందిన గిరీష్ పటేల్‌తో పాటు, స్థానికంగా రైతులకు విత్తనాలు అంటగడుతున్న ఇచ్చోడ మండలం ధాబా-కే గ్రామానికి చెందిన విక్రయదారుడు ఈశ్వర్‌ను ఇచ్చోడలోనే పక్కా సమాచారంతో పట్టుకుని అరెస్ట్ చేయడం గమనార్హం. ఈ దందాలో పాలుపంచుకున్న మహారాష్ట్రకు చెందిన సందేశ్ బండేవర్, కృష్ణ, ఇచ్చోడకు చెందిన గణేష్, ఉట్నూరుకు చెందిన కిరణ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఈ ఏడాది మార్చిలో గిరీష్ పటేల్ వద్ద నుంచి తెప్పించిన 500 ప్యాకెట్లలో 300 ప్యాకెట్లను ఈశ్వర్‌కు, 158 ప్యాకెట్లను గణేష్‌కు విక్రయించినట్లు విచారణలో తేలింది.

Adilabad police officials displaying seized fake cotton seeds and arrested gang members
Adilabad SP Akhil Mahajan briefing the media about the busted interstate fake cotton seeds gang.

భారీగా పట్టుబడిన నకిలీ విత్తనాలు, గడువు తీరిన మందులు..

నిందితుడు సునీల్ కుమార్ ఇచ్చిన సమాచారంతో అతని కంపెనీ, గోడౌన్లలో పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా అనధికారిక, గడువు తీరిన సరుకు పట్టుబడింది. సుమారు 792 ‘పింక్ బాండ్’ నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లతో పాటు.. విక్కీ, హ్యాపీ, నేచర్, జోష్, లైనస్, బుల్లెట్, సర్దార్, డివైన్ తదితర పేర్లతో ఉన్న వందలాది లీటర్లు, కిలోల బయో-పెస్టిసైడ్స్ బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 40 కిలోల గడువు ముగిసిన కందులు, 240 కిలోల మొక్కజొన్న విత్తనాలు, మిర్చి, బెండ విత్తనాలు, ప్యాకింగ్ సంచులు, నీలం, నలుపు రంగు ముడి పదార్థాలు, లేబుల్ ప్రింటింగ్, ప్యాకింగ్, ఎలక్ట్రానిక్ తూకం మెషీన్లను సీజ్ చేశారు. రవాణాకు ఉపయోగించిన ఏపీ01 ఏసీ 4413 నంబరు గల ఇండికా విస్టా కారు, నాలుగు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నకిలీ పత్తి విత్తనాల విలువ బహిరంగ మార్కెట్లో రూ. 9,50,400 ఉంటుందని, గడువు ముగిసిన మందుల విలువ మరో రూ. 9.5 లక్షలు ఉంటుందని కలిపి మొత్తం రూ. 19,00,400 విలువైన సరుకును సీజ్ చేసినట్లు అధికారులు వివరించారు.

రైతులు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ అఖిల్ మహాజన్

రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చట్టాల కింద చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా అధికారిక డీలర్ల వద్ద పక్కా బిల్లు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా విత్తనాలు, పురుగుమందులు అమ్మితే వెంటనే వ్యవసాయ అధికారులు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఆపరేషన్‌లో చాకచక్యంగా వ్యవహరించిన ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, టూటౌన్ సీఐ కే. నాగరాజు, సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, ఎస్సైలు అఖిల్, గోపికృష్ణ తదితర సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Seized fake cotton seeds packets and arrested interstate gang members in Adilabad
Rs 20 lakh worth of fake cotton seeds and expired pesticides seized by Adilabad police during a major raid.

 

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular