• మానవ హక్కుల మండలి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కర్నాల చంద్రశేఖర్
వాస్తవ నేస్తం,ఇచ్చోడ : మండలంలోని ప్రైవేట్ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే అరికట్టి, ఆయా పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని జాతీయ మానవ హక్కుల మండలి (ఎన్.జి.ఓ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సంస్థ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కర్నాల చంద్రశేఖర్ తదితరులు ఇచ్చోడ మండల విద్యాశాఖా కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు.
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన దరిమిలా, మండలంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచేసి మధ్యతరగతి, పేద వర్గాల విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయని సంస్థ ప్రతినిధులు ఆరోపించారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన బడులు వ్యాపార కేంద్రాలుగా మారాయని, పాఠశాల ప్రాంగణాల్లోనే సిలబస్ పుస్తకాలు, యూనిఫామ్‌లను విక్రయిస్తూ యాజమాన్యాలు భారీగా లాభాలు గడిస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయని వారు వినతిపత్రంలో మండిపడ్డారు. అంతేకాకుండా, విద్యార్థుల తల్లిదండ్రులు చెల్లించే ఫీజులకు సంబంధించి పాఠశాలలు సరైన రసీదులు ఇవ్వకుండా అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
విద్యా హక్కు చట్టం, అలాగే వినియోగదారుల రక్షణ చట్టం నిబంధనల ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థల నియంత్రణకు విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా, విద్యా హక్కు చట్టం ప్రకారం వెనుకబడిన, బలహీన వర్గాల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లను కేటాయించే నిబంధనను కచ్చితంగా అమలు చేసేలా చూడాలని కోరారు. విద్యాసంస్థల్లో పుస్తకాలు, యూనిఫాంల అమ్మకాలను తక్షణమే నిలిపివేయించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల అక్రమ ధోరణిని అరికట్టడానికి అధికారులు ప్రతి నెలా సమీక్షా సమావేశాలు, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని జాతీయ మానవ హక్కుల మండలి ప్రతినిధులు స్పష్టం చేశారు. అలాగే, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రత్యేక శ్రద్ధ వహించేలా ఆదేశాలు జారీ చేయాలని వారు మండల విద్యాశాఖా అధికారికి విజ్ఞప్తి చేశారు.
