HomeCinema Newsజీ తెలుగు ‘డ్రామా జూనియర్స్ సీజన్-9’కు ఆదిలాబాద్ బాలిక ఎంపిక..

జీ తెలుగు ‘డ్రామా జూనియర్స్ సీజన్-9’కు ఆదిలాబాద్ బాలిక ఎంపిక..

• జిల్లాకు గర్వకారణంగా అశ్విత సింగ్!
• నేటి నుంచే బుల్లితెరపై ప్రసారం కానున్న కార్యక్రమం
• ప్రెస్ క్లబ్‌లో అకాడమీ డైరెక్టర్ మహేష్ మాస్టర్ వెల్లడి
 • చిన్న వయసులోనే రాష్ట్రస్థాయి వేదికపై ప్రతిభ చాటడంపై హర్షం

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : పట్టణానికి చెందిన ఓ గిరిజన బాలిక తన అద్భుత నటనతో రాష్ట్రస్థాయి బుల్లితెర వేదికపై మెరిసేందుకు సిద్ధమైంది. ప్రముఖ టెలివిజన్ ఛానల్ ‘జీ తెలుగు’ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డ్రామా జూనియర్స్ సీజన్-9 కార్యక్రమానికి ఆదిలాబాద్‌కు చెందిన అశ్విత సింగ్ నాయక్ ఎంపికై జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. దుబ్బగూడ కు చెందిన అమర్ సింగ్ నాయక్, మౌనిక సింగ్ నాయక్ దంపతుల కుమార్తె అయిన అశ్విత.. స్థానిక మ్యాగీ డ్యాన్స్ అండ్ ఫిట్‌నెస్ అకాడమీ లో శిక్షణ పొందుతోంది. జీ తెలుగు ప్రతినిధులు నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆడిషన్స్‌లో తన నటన, అభినయ ప్రతిభతో జడ్జీలను మెప్పించి, ఈ సీజన్‌లో పాల్గొనే సువర్ణావకాశాన్ని దక్కించుకుంది. ఈ సూపర్ హిట్ రియాలిటీ షో నేటి (ఆదివారం) నుంచే ప్రసారం కానుంది.

అశ్విత ఎంపికైన సందర్భంగా ఆదివారం ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ మహేష్ మాస్టర్, ఫిట్‌నెస్ మరియు యోగా ట్రైనర్ హంస మాట్లాడుతూ.. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక గిరిజన బాలిక ఇంత పెద్ద వేదికకు ఎంపిక కావడం జిల్లా ప్రజలందరికీ ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే రాష్ట్రస్థాయి పోటీల్లో అసాధారణ ప్రతిభను చాటుకోవడం అభినందనీయమన్నారు.

అశ్విత సాధించిన ఈ విజయానికి ఆమె తల్లిదండ్రుల మద్దతు, గురువులు అందించిన ప్రత్యేక శిక్షణతో పాటు బాలిక నిరంతర శ్రమే ప్రధాన కారణమని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో అశ్విత మరిన్ని విజయాలు సాధించి, ఆదిలాబాద్ జిల్లా ఖ్యాతిని తెలుగు రాష్ట్రాల్లో మరింత పెంచాలని వారు ఆకాంక్షించారు. ఈ విలేకరుల సమావేశంలో అకాడమీ సభ్యులు, తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని అశ్వితను ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. రానున్న ఎపిసోడ్‌లలో అశ్విత తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని, టైటిల్ సాధించాలని ఆకాంక్షించారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular