వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ఇటీవల అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల కారణంగా బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గోల్డ్ ప్రియులకు బంగారం రేట్లు మరోసారి ఆశ్చర్యం కలిగించాయి. వెనిజులా సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడంతో బులియన్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవలే ఆల్‌టైం హై స్థాయికి చేరిన బంగారం ధరలు గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గినప్పటికీ, తాజా పరిణామాల తర్వాత మళ్లీ పెరుగుదల దిశగా కదిలాయి. అమెరికా వెనిజులాపై చేపట్టిన చర్యల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి పెరిగి, దాని ప్రభావం బంగారం, వెండి మరియు ముడి చమురు ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది.
సోమవారం ఉదయం ఆరు గంటలకు 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,810గా ఉండగా, మధ్యాహ్నం 12 గంటల సమయానికి అది రూ.1,37,400కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర ఉదయం రూ.1,24,490గా ఉండి, ప్రస్తుతం రూ.1,25,950గా కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,37,400గా ఉంది. చెన్నైలో తులం బంగారం రూ.1,38,330గా కొనసాగుతుండగా, ఢిల్లీలో రూ.1,37,550 వద్ద ట్రేడవుతోంది.
బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. సోమవారం ఉదయం ధరలతో పోలిస్తే కేజీ వెండి ధర దాదాపు రూ.6,000 వరకు పెరిగి ప్రస్తుతం రూ.2,47,000 వద్ద కొనసాగుతోంది.
మార్కెట్ నిపుణుల ప్రకారం, వెనిజులాపై అమెరికా చర్యల తర్వాత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడులైన బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితులు కొనసాగితే బంగారం, వెండి మాత్రమే కాకుండా రాగి, ముడి చమురు వంటి ఇతర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.
– Qamar SD

