HomeTrending NewsHappy Mother's Day | వాట్సాప్ స్టేటస్‌లలో అమ్మ.. వృద్ధాశ్రమాల్లో కన్నవాళ్లు.! ఇదేనా అసలైన మదర్స్...

Happy Mother’s Day | వాట్సాప్ స్టేటస్‌లలో అమ్మ.. వృద్ధాశ్రమాల్లో కన్నవాళ్లు.! ఇదేనా అసలైన మదర్స్ డే..?

డిజిటల్ యుగంలో ప్రేమలన్నీ తెరలకే పరిమితం అవుతున్నాయి. మదర్స్ డే అనగానే స్మార్ట్‌ఫోన్ తీసి, సోషల్ మీడియాలో అమ్మపై కవితలు కురిపించే సమాజం.. అదే సమయంలో కన్నవాళ్లను వృద్ధాశ్రమాల్లో వదిలేస్తుండటం ప్రస్తుత సమాజపు నగ్న సత్యం. ముసలితనంలో అమ్మానాన్నలను ఓల్డ్ ఏజ్ హోమ్‌కు పంపినప్పుడే బహుశా ఈ తరానికి నిజమైన మదర్స్ డే వస్తుందేమో! అన్న చేదు నిజం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.

అమ్మ… ఈ పదంలోనే అనంతమైన ప్రేమ దాగి ఉంది. తనకంటూ ఉన్న ఇష్టాలను, కన్న కలలను ఎప్పుడో ఆ వంటగదిలోని పొయ్యి మంటల్లోనే కాల్చేస్తుంది. ఒంట్లో జ్వరంతో కాలిపోతున్నా, నీరసం ఆవహించినా.. నా బిడ్డకు ఆకలి వేస్తుందేమోనన్న ఒకే ఒక్క ఉద్దేశంతో తెల్లవారుజామునే నిద్రలేచి వంట చేస్తుంది. తన బట్టలు పాతబడిపోయినా, చిరిగిపోతున్నా పట్టించుకోదు. కానీ తన బిడ్డకు మాత్రం ఏ లోటూ రాకుండా బ్రాండెడ్ బట్టలు కొనిస్తుంది. బయట సమాజంలో ఆమె ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఎన్ని కష్టాలు పడినా ఆ బాధలన్నీ తన గుండెల్లోనే దాచుకుని.. కన్నబిడ్డల కళ్ల ముందు మాత్రం స్వచ్ఛమైన చిరునవ్వుతో కనిపిస్తుంది.

సోషల్ మీడియా ప్రేమలు.. వృద్ధాశ్రమాల వెతలు..

కానీ, ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన ఆ అమ్మకు ఆఖరి రోజుల్లో మనం ఇస్తున్న బహుమతి ఏంటి..? ఒకప్పుడు తమ పిల్లలు ఆడుకోవడానికి ఇల్లంతా సరిపోలేదని మురిసిపోయిన ఆ తల్లిదండ్రులకు.. ఈరోజు అదే ఇంట్లో ఒక మూల చోటు కరువవుతోంది. స్టేటస్‌లలో అమ్మపై ప్రేమను ఒలకబోసే కొడుకులు, వాస్తవ జీవితంలో మాత్రం వారిని భారంగా భావించి వృద్ధాశ్రమాలకు పంపుతున్నారు. సోషల్ మీడియాలో హ్యాపీ మదర్స్ డే అని పెట్టిన స్టేటస్ 24 గంటల్లో మాయమైపోయినట్టే.. వారి గుండెల్లో కన్నవారిపై ప్రేమ కూడా అంతే త్వరగా ఆవిరైపోతోంది. బహుశా, బరువు బాధ్యతలన్నీ వదిలించుకుని తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్‌లో వదిలేసి, ఫోన్లో స్టేటస్ పెట్టిన రోజే.. నేటి సమాజానికి అసలైన ‘మదర్స్ డే’ గా మారిపోయిందేమో! ఇది మనల్ని మనం వేసుకోవాల్సిన అతిపెద్ద ప్రశ్న.

స్టేటస్‌లు కాదు.. స్పర్శ కావాలి.!

అలాంటి అమ్మకు స్మార్ట్‌ఫోన్లకే పరిమితమైన సోషల్ మీడియా శుభాకాంక్షలు కాదు కావాల్సింది. కేవలం ఒకరోజు స్టేటస్‌లు పెట్టి సంబరాలు చేసుకుంటే ఆమె రుణం తీరిపోదు. ఆమెకు కావాల్సింది ఆఖరి రోజుల్లో ఆత్మీయమైన స్పర్శ. పదిమందికి చూపించుకునే కృత్రిమ ప్రేమ కంటే, వీలైతే ఈరోజే వెళ్లి ఆమెను ఒక్కసారి గట్టిగా హత్తుకోండి. “నీకోసం నేనున్నాను అమ్మా” అని ఒక్క మాట చెప్పండి. ఆ ఒక్క మాట, ఆ స్పర్శ చాలు ఆమె జీవితాంతం సంతోషంగా బతకడానికి.

ఈ మదర్స్ డే రోజున స్టేటస్‌లు మార్చడం కాదు.. వృద్ధాశ్రమాల వైపు అడుగులేస్తున్న మన ఆలోచనా విధానాన్ని మారుద్దాం. ఎందుకంటే.. ఈ భూమి మీద అమ్మకు మించిన దైవం లేదు.. అమ్మ ప్రేమకు మించిన బహుమతి మరొకటి లేదు..

By… QAMAR

RELATED ARTICLES
- Advertisment -

Most Popular