ప్రపంచ మార్కెట్లలో వెండి ధరలు మరోసారి హీట్ పెంచుతున్నాయి. అంతర్జాతీయంగా సిల్వర్ ధరలు చరిత్రాత్మక గరిష్ఠ స్థాయిల వద్ద ట్రేడవుతుండగా… పెట్టుబడిదారుల దృష్టి ఒక్కసారిగా వెండిపై పడింది. అమెరికా విధాన నిర్ణయాలు, గ్లోబల్ అనిశ్చితులు కలిసి వెండికి బలమైన మద్దతుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ రిచ్ డాడ్ పూర్ డాడ్ ’ రచయిత, ప్రముఖ పెట్టుబడిదారుడు రాబర్ట్ కియోసాకి చేసిన తాజా వ్యాఖ్యలు మార్కెట్లలో సంచలనంగా మారాయి. ప్రస్తుతం COMEX మార్కెట్లో వెండి ధరలు ఒక ఔన్సుకు $94 పైగా చేరాయి. గత సెషన్‌లో కొంత ఒత్తిడి కనిపించినప్పటికీ, తిరిగి వేగంగా పుంజుకోవడం గమనార్హం. ఈ వేగం చూస్తుంటే… వెండి ర్యాలీ ఇంకా ముగిసిపోలేదన్న అభిప్రాయం బలపడుతోంది.
బంగారం కాదు… వెండే భవిష్యత్తు..? కియోసాకి లాజిక్ ఇదే..
జనవరి 22న సోషల్ మీడియా వేదిక Xలో చేసిన పోస్ట్‌లో రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్య చేశారు. “ఈ రోజుల్లో బంగారం కంటే వెండినే నేను ఎక్కువగా ఇష్టపడుతున్నాను” అని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో వెండి ప్రాముఖ్యత మరింత పెరిగిందని, 2026 నాటికి వెండి ధర ఔన్సుకు $200 వరకు చేరే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ఇది ప్రస్తుత ధరలతో పోలిస్తే 100 శాతం కంటే ఎక్కువ లాభం సూచిస్తోందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కియోసాకి అభిప్రాయం ప్రకారం వెండి ఇప్పుడు కేవలం విలువ నిల్వ చేసే లోహం మాత్రమే కాదు. ఆధునిక సాంకేతిక యుగంలో వెండి ఒక కీలక పారిశ్రామిక లోహంగా మారింది. సౌర విద్యుత్ ప్లాంట్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాలు, రక్షణ రంగం… ఇలా అనేక కీలక రంగాల్లో వెండికి డిమాండ్ వేగంగా పెరుగుతోంది.
1990లలో ఔన్సుకు కేవలం $5గా ఉన్న వెండి ధర ఇప్పుడు $90 దాటడం ఈ మార్పుకు స్పష్టమైన ఉదాహరణగా కియోసాకి గుర్తు చేస్తున్నారు. అప్పటి పారిశ్రామిక విప్లవ కాలంలో ఇనుము ఎంత కీలకమో… నేటి టెక్నాలజీ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో వెండి కూడా అంతే కీలకమని ఆయన పోల్చిచెప్పారు. అయితే తన అంచనాలు తప్పక నిజమవుతాయన్న హామీ ఇవ్వలేనని కూడా కియోసాకి స్పష్టం చేశారు. మార్కెట్లలో అనిశ్చితి ఎప్పుడూ ఉంటుందని, తన అంచనాలు తప్పు కావచ్చని కూడా ఆయన అంగీకరించడం విశేషం.

వెండికి పారిశ్రామిక డిమాండ్ అధికంగా ఉండడంతో మళ్లీ వెండి కొనుగోలు పై ఇన్వెస్టర్లు ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కియోసాకి అంచనాలు నిజమైతే వెండి మరో బలమైన బుల్ రన్‌ను చూడొచ్చు. అయితే ధరలు ఇప్పటికే హై లెవెల్స్‌లో ఉండటంతో, పెట్టుబడులు వేయేముందు జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Written by: Qamar SD, Vaasthava Nestham Editorial Team, Published: January 16, 2025 | 08:15 AM

