గత కొన్ని నెలలుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. రికార్డు స్థాయిలను తాకిన ఈ విలువైన లోహాలు తాజాగా భారీగా పడిపోవడంతో మార్కెట్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. ప్యూచర్ మార్కెట్‌లో వెండి ధర ఏకంగా రూ.67 వేల వరకు తగ్గడం గమనార్హం. గురువారం రోజున రూ.4,20,048తో ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసిన వెండి ధర, ఆ వెంటనే భారీ పతనం చెంది దాదాపు రూ.90 వేల నష్టంతో రూ.3,32,002 స్థాయికి చేరింది.
ఇక బంగారం కూడా వెండితో పాటు తగ్గుముఖం పట్టింది. 10 గ్రాముల బంగారం ధర ఒక్కసారిగా రూ.15 వేల వరకు తగ్గి రూ.1,54,157కు చేరింది. ఇటీవల వరుసగా కొత్త రికార్డులు నమోదు చేసిన నేపథ్యంలో ఈ తగ్గుదల మార్కెట్‌కు షాక్‌గా మారింది.
హైదరాబాద్ మార్కెట్‌లో పరిస్థితి ఇలా…
హైదరాబాద్ విపణిలో గురువారం రాత్రి కిలో వెండి ధర రూ.3,99,600గా ఉండగా, శుక్రవారం ఉదయానికి అది రూ.3,70,000కి పడిపోయింది. అంటే ఒక్కరాత్రిలోనే దాదాపు రూ.30 వేల మేర తగ్గుదల నమోదైంది.

అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టినట్లు సమాచారం. గ్లోబల్ సంకేతాలు, డాలర్ బలపడటం, లాభాల స్వీకరణ (Profit Booking) వంటి అంశాలు ఈ పతనానికి కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇటీవలి రోజులలో ధరలు హద్దులు దాటడంతో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కొనసాగితే, సమీప కాలంలో ధరల్లో మరింత ఊగిసలాటకు అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీర్ఘకాల పెట్టుబడిదారులకు ఇది ఒక అవకాశం కావచ్చని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి.
