• ఇంద్రవెల్లిలో రూ. 30 లక్షలతో సోయా ఉత్పత్తుల తయారీ కేంద్రం ప్రారంభం
• మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
• ప్రారంభ బాల్య అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్ రాజర్షి షా
• మహిళా సంఘాలకు రూ. 29 లక్షల చెక్కుల పంపిణీ
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాలు – 2026’ సంబరాల్లో భాగంగా శుక్రవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘సోయా ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని’ శాసనసభ్యులు వెడ్మ బొజ్జుతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మహిళా సంఘాలు, గుడిహత్నూర్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ సంస్థ ఇక్రిశాట్ సాంకేతిక భాగస్వామ్యంతో రూ. 30 లక్షల వ్యయంతో ఈ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
మహిళల ఉపాధికి పెద్దపీట: కలెక్టర్ రాజర్షి షా
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సోయాబీన్ సాగు విస్తృతంగా ఉన్నప్పటికీ, స్థానికంగా ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోవడంతో రైతులు, మహిళలు ఆశించిన స్థాయిలో లబ్ధి పొందలేకపోతున్నారని, ఈ లోటును భర్తీ చేసేందుకే కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంద్రవెల్లిలో మిల్లెట్ (చిరుధాన్యాల) యూనిట్ తరహాలోనే.. గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, సిరికొండ మండలాల్లో పెరటి కోళ్ల పెంపకం, మదర్ యూనిట్లు, ఉట్నూర్‌లో ప్రత్యేక క్యాంటీన్ వంటి వినూత్న ఉపాధి కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు.
ఇదే వేదికపై ‘ప్రారంభ బాల్య అభివృద్ధి’ ప్రాముఖ్యతను కలెక్టర్ వివరించారు. గర్భధారణ నుండి శిశువుకు రెండేళ్లు నిండే వరకు ఉండే 1000 రోజులు జీవితానికి పునాది లాంటివని, ఈ సమయంలో పిల్లల ఎదుగుదల కోసం పోషకాహారం, ఆరోగ్యం, ప్రారంభ విద్య తదితర 6 సూత్రాలను పాటించాలన్నారు. గర్భిణులు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని, బిడ్డ పుట్టిన 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. దీనిపై అంగన్‌వాడీ సిబ్బంది గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.
మహిళలకే గోదాములు, రైస్ మిల్లుల నిర్వహణ: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
ప్రజా ప్రభుత్వం మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు స్పష్టం చేశారు. మహిళలను కేవలం రుణాలకే పరిమితం చేయకుండా పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ గోదాములు, రైస్ మిల్లుల నిర్వహణ బాధ్యతలను కూడా మహిళలకే అప్పగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. మహిళా సమాఖ్యల వ్యాపార అవసరాల కోసం ప్రతి మండలానికి ఒక ప్రత్యేక బస్సు కేటాయించడంతో పాటు, పెట్రోల్ బంకుల ఏర్పాటుకు అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న గ్రామ సంఘ భవనాల స్థల సమస్యలను పరిష్కరించి డిసెంబర్ 9 కల్లా వంద శాతం నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లు, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నూతన పెన్షన్ల పంపిణీ ఘనంగా ప్రారంభించబోతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
స్థానిక ఉత్పత్తులకు ప్రశంసలు..
అనంతరం మండల సమైక్య మహిళా సంఘాల సభ్యులకు రూ. 29 లక్షల చెక్కులను కలెక్టర్, ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్థానిక ఉత్పత్తుల స్టాళ్లను, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సెల్ఫ్ పాయింట్‌ను సందర్శించారు. మహిళలు తయారు చేసిన పోషకాహారాలను రుచి చూసి వారి నైపుణ్యాలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో రవీందర్ రాథోడ్, డీడబ్ల్యూఓ మీల్కా, జడ్పీ సీఈవో రవి, ఏఎంసీ చైర్మన్ ముకాడే ఉత్తమ్, సర్పంచ్ రాథోడ్ మోహన్ సింగ్, ఎంపీడీవో జీవన్ రెడ్డి, ఐకేపీ ఏపీఎం మంజుల, మహిళా సంఘాల ప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
