HomeTelanganaఎవరెస్ట్ యాత్రకు ఆదిలాబాద్ గిరిపుత్రుడు

ఎవరెస్ట్ యాత్రకు ఆదిలాబాద్ గిరిపుత్రుడు

• దేశం నలుమూలల నుంచి ఐదుగురు ఎంపిక.. రాష్ట్రం నుంచి ఆనంద్‌రావు ఒక్కడే
• ఆర్థిక సాయం కోసం దాతలకు ఆదివాసీ యువకుడి విజ్ఞప్తి

 

వాస్తవ నేస్తం,ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ గిరిజన యువకుడికి అరుదైన అవకాశం దక్కింది. పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన ఆ యువకుడు.. ఇప్పుడు ఎవరెస్ట్ బేస్ క్యాంపులో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. అయితే, పేదరికం ఆ యువకుడి ఆశలకు సంకెళ్లు వేస్తోంది. ఇచ్చోడ మండల పరిధిలోని దుబార్‌పేట్ గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడు కాత్లె ఆనంద్‌రావు.. నేపాల్ దేశంలో జరగనున్న ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు ఎంపికయ్యాడు. భారతదేశం నలుమూలల నుంచి ఎవరెస్ట్ అధిరోహణ కోసం కేవలం ఐదుగురికి మాత్రమే అవకాశం రాగా, అందులో తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆనంద్‌రావు ఎంపిక కావడం గమనార్హం. జూలై 27వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు నేపాల్‌లో ఈ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ జరగనుంది.

సాయం కోసం ఎదురుచూపులు..

దేశస్థాయిలో సత్తా చాటినప్పటికీ, ఆనంద్‌రావును ఆర్థిక ఇబ్బందులు వెక్కిరిస్తున్నాయి. తన పరిస్థితిని వివరిస్తూ ఆనంద్‌రావు ఆవేదన వ్యక్తం చేశాడు. “ఎవరెస్ట్ బేస్ క్యాంపులో పాల్గొనే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కానీ, అత్యంత పేద కుటుంబంలో జన్మించిన నేను అడ్మిషన్ ఫీజు, నేపాల్‌కు వెళ్లేందుకు అవసరమైన రవాణా ఖర్చులు భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను. ఈ యాత్ర కోసం సుమారు రూ. 2,50,000 వరకు ఖర్చు అవుతుంది. దాతలు, స్వచ్ఛంద సంస్థలు లేదా ప్రభుత్వ అధికారులు ముందుకు వచ్చి నాకు ఆర్థిక సాయం అందించి నా కలను సాకారం చేయాలి అని ఆయన వేడుకుంటున్నాడు. ఓ పేద గిరిజన యువకుడు ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ఉదార స్వభావులు ముందుకు వచ్చి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular