• కరస్పాండెంట్ మార శ్యామ్ రెడ్డి ప్రత్యేక చొరవతో విద్యార్థుల్లో ఓటు చైతన్యం
• ముఖ్య అతిథిగా హాజరైన సీఐ నరేష్ కుమార్
వాస్తవ నేస్తం,ఇచ్చోడ : మండల కేంద్రంలోని విద్యాలయ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన విద్యార్థుల మాక్ పోలింగ్ అచ్చం సాధారణ ఎన్నికలను తలపించేలా సాగింది. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు, చిన్నతనం నుంచే ప్రజాస్వామ్య విలువలపై, ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రాక్టికల్ గా అవగాహన కల్పించాలన్న పాఠశాల కరస్పాండెంట్ మార శ్యామ్ రెడ్డి ప్రత్యేక చొరవ, పర్యవేక్షణలో ఈ ఎన్నికల ప్రక్రియ జరిగింది. ఈ వినూత్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక సీఐ నరేష్ కుమార్ పోలింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నిర్వహించిన ఈ మాక్ పోలింగ్ విధానం నిజమైన ఎన్నికల వాతావరణాన్ని గుర్తుచేసిందని ప్రశంసించారు. పాఠశాల మొత్తానికి, అలాగే ప్రతి తరగతికి ఒక విద్యార్థిని ‘హెడ్’ గా వ్యవహరించేలా ఈ ఎన్నికలను నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.
ఒక్కో తరగతి గది నుంచి ఇద్దరు అభ్యర్థులను ఎంపిక చేసి బరిలో నిలిపారు. అభ్యర్థుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం నెలకొనగా, విద్యార్థులు తమకు నచ్చిన నాయకుడికి బ్యాలెట్ పత్రాల ద్వారా ఓటు వేశారు. అత్యంత ఉత్సాహంగా, బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకున్న విద్యార్థులు తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు.
పాఠశాల కరస్పాండెంట్ మార శ్యామ్ రెడ్డి ముందుచూపుతో కూడిన నాయకత్వంలో, ప్రిన్సిపాల్ ప్రమోద్ కుమార్ మరియు ఉపాధ్యాయుల దిశానిర్దేశంతో ఈ ఎలక్షన్లు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా సాగాయి. పుస్తకాల్లో చదువుకోవడమే కాకుండా, ప్రయోగాత్మకంగా ఓటింగ్ ప్రక్రియను విద్యార్థులకు పరిచయం చేసిన మార శ్యామ్ రెడ్డిని ఈ సందర్భంగా పలువురు అభినందించారు.
