HomeEducationముగిసిన వేసవి సెలవులు.. సోమవారం నుంచి బడిబాట

ముగిసిన వేసవి సెలవులు.. సోమవారం నుంచి బడిబాట

• మొదటి రోజే అమావాస్య కావడంతో వెనుకడుగు వేస్తున్న తల్లిదండ్రులు

• మరుసటి రోజు మంగళవారం.. బుధవారం నుంచే పంపే యోచన

• పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ

• అందుబాటులో తాగునీరు, ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు

వాస్తవ నేస్తం,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవులు ముగియడంతో రేపటి నుంచి (సోమవారం) పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ సాధారణ షెడ్యూల్ ప్రకారం జూన్ 12 వరకే వేసవి సెలవులు ముగియాల్సి ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం జూన్ 14 వరకు సెలవులను పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం నుంచి విద్యార్థులు తిరిగి బడిబాట పట్టనున్నారు. అయితే, సరికొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే మొదటి రోజే పిల్లలను స్కూల్ కు పంపే విషయంలో కొందరు తల్లిదండ్రులను సెంటిమెంట్లు పట్టిపీడిస్తున్నాయి.

సాధారణంగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం రోజున పిల్లలను ఎంతో ఉత్సాహంగా బడికి పంపుతారు. కానీ, సోమవారం ‘అమావాస్య’ వస్తుండటంతో జ్యోతిష్య నియమాలు, నమ్మకాల ప్రకారం కొత్త పనులు, చదువులు ప్రారంభించడానికి ఈ రోజు మంచిది కాదని పలువురు తల్లిదండ్రులు భావిస్తున్నారు. అమావాస్య సెంటిమెంట్ తో మొదటి రోజు పిల్లలను బడికి పంపేందుకు వారు ఆసక్తి చూపడం లేదు. పోనీ, అమావాస్య ముగిసిన తర్వాత పంపుదామనుకుంటే.. ఆ మరుసటి రోజు ‘మంగళవారం’ వస్తోంది. మంగళవారం రోజున కూడా కొత్త పనులకు శ్రీకారం చుట్టకూడదనే నమ్మకం చాలామందిలో బలంగా ఉంది. దీంతో ఈ రెండు రోజులను పక్కనబెట్టి.. నేరుగా బుధవారం నుంచే పిల్లలను స్కూళ్లకు పంపాలని మెజారిటీ తల్లిదండ్రులు యోచిస్తున్నట్లు సమాచారం.

సర్వం సిద్ధం చేసిన విద్యాశాఖ:

ఒకవైపు తల్లిదండ్రులు సెంటిమెంట్ల కారణంగా పిల్లలను బడికి పంపేందుకు వెనుకడుగు వేస్తుంటే.. మరోవైపు విద్యాశాఖ మాత్రం స్కూళ్ల పునఃప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు యథావిధిగా పనిచేయనున్నాయని అధికారులు స్పష్టం చేశారు. కొత్త విద్యా సంవత్సరంలో అడుగుపెడుతున్న విద్యార్థులకు స్వాగతం పలికేందుకు సర్కారు బడులు ముస్తాబయ్యాయి. విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ తో పాటు మౌలిక వసతులను సిద్ధంగా ఉంచారు.

ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు తప్పనిసరి:

రాష్ట్రంలో ఇంకా ఎండల తీవ్రత, ఉక్కపోత పూర్తిగా తగ్గకపోవడంతో.. పిల్లల ఆరోగ్య భద్రత దృష్ట్యా విద్యాశాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రతి పాఠశాలలో తగినంత తాగునీటి సదుపాయం కల్పించాలని, అలాగే వడదెబ్బ బారిన పడకుండా పిల్లలకు అందించేందుకు ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలల యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశా

లు జారీ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular