• బాలుడిని చితకబాదిన వైనం
• వీడియో ఆధారాలతో పోలీసులను ఆశ్రయించిన తల్లి
• జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కన్నెర్రజేశాడు. చిన్నారి అని కూడా చూడకుండా ఓ విద్యార్థిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు టీచర్ తో పాటు సదరు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. మండలంలోని కుచలాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ కుమారుడు బోథ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. ఈ నెల 27న బాలుడు తరగతి గదిలో ఉండగా క్లాస్ టీచర్ దారుణంగా ప్రవర్తించారు. బాలుడితో కొంతసేపు గుంజీలు తీయించి , అనంతరం చెంపలపైనా, శరీరంపైనా ఇష్టానుసారంగా కొట్టాడు. పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి చేరుకున్న బాలుడు తీవ్రంగా ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. బాలుడి చెవి, చెంప తదితర భాగాల్లో కమిలిన గాయాలను చూసి వారు చలించిపోయారు. ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలను సేకరించిన బాలుడి తల్లి.. నేరుగా బోథ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు, సమర్పించిన ఆధారాల మేరకు పోలీసులు సదరు ఉపాధ్యాయుడితో పాటు పాఠశాల యాజమాన్యంపై జువైనల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) చట్టం కింద కేసు నమోదు చేశారు.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!
జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్