HomeUncategorizedబ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన వ్యక్తి అరెస్ట్..

బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన వ్యక్తి అరెస్ట్..

వాస్తవ నేస్తం,ఇచ్చోడ: పేద విద్యార్థుల సంక్షేమం పేరుతో విరాళాలు సేకరిస్తూ, ఆపై భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన ఓ వ్యక్తిని ఇచ్చోడ పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. అడిగినంత ఇచ్చుకోకపోతే సోషల్ మీడియాలో పాఠశాల, ఉపాధ్యాయులపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తానని బెదిరింపులకు దిగిన ఈ ఘటనపై ఇచ్చోడ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ నరేష్ కుమార్ వివరాలు వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం.. కోతూరి ప్రవీణ్ అలియాస్ కొట్టూరు ప్రవీణ్ తాను టీజీవీపీ విద్యార్థి సంఘం నాయకుడినని చెప్పుకుంటూ, పేద విద్యార్థులకు సహాయం చేయాలనే సాకుతో ఇచ్చోడ మండల పరిధిలోని నర్సాపూర్ ఎంజేపీ బాలుర పాఠశాలను తరచూ సందర్శించేవాడు. విరాళాల పేరుతో అతను అడిగిన దానికి పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు గతంలో రూ.500 నుంచి రూ.1000 వరకు చందాలుగా అందించారు. అయితే, ఇటీవల మరోసారి పాఠశాలకు వచ్చిన ప్రవీణ్, ఏకంగా రూ.50,000 ఇవ్వాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశాడు.

అంత పెద్ద మొత్తం ఇచ్చేందుకు ప్రిన్సిపాల్ నందా సింగ్ ఠాకూర్ తో పాటు ఇతర ఉపాధ్యాయులు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన ప్రవీణ్ వారిని తీవ్ర స్థాయిలో బెదిరించాడు. తాను అడిగిన డబ్బు ఇవ్వకపోతే పాఠశాలతో పాటు ఉపాధ్యాయుల పరువు తీసేలా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తానని హెచ్చరించాడు. అంతేకాకుండా, ప్రిన్సిపాల్‌ ఉద్యోగం ఊడేలా చేస్తానని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయాందోళనలకు గురిచేశాడు.

దీనిపై ప్రిన్సిపాల్ నందా సింగ్ ఠాకూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు స్పందించిన ఇచ్చోడ పోలీసులు, నిందితుడు ప్రవీణ్‌పై క్రైమ్ నంబర్ కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ.. సహాయం పేరుతో చందాలు వసూలు చేస్తూ బ్లాక్‌మెయిల్ లేదా బెదిరింపులకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, విద్యాసంస్థల నిర్వాహకులు ఇలాంటి బెదిరింపులకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని ఆయన సూచించారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!

జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్
RELATED ARTICLES
- Advertisment -

Most Popular