వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : జిల్లా కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ మరియు అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ రాజర్షి షా అధ్యక్షతన బుధవారం జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశం బుధవారం నిర్వహించబడింది. జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల మంజూరుపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
జిల్లా వ్యాప్తంగా అక్రిడిటేషన్ కోసం అందిన సుమారు 450 దరఖాస్తులను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. నిబంధనల ప్రకారం అర్హత కలిగిన దాదాపు 250 మంది విలేకరుల పేర్లను మొదటి విడతలో కమిటీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వీరికి సంబంధించిన అక్రిడిటేషన్ కార్డులను మరో 4 నుండి 5 రోజుల్లో పంపిణీ చేయనున్నట్లు సమాచారం.
ఏప్రిల్ 10 లోపు రెండో జాబితా..!!
మొదటి విడతలో సాంకేతిక కారణాల వల్ల పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను, మిగిలిన అర్హుల జాబితాను పరిశీలించి ఏప్రిల్ 10వ తేదీ లోపు రెండో విడత జాబితాను విడుదల చేయాలని కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. పారదర్శకమైన పద్ధతిలో, నిబంధనలకు లోబడి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు కార్డు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌తో ఉన్నతాధికారులు ఐటిడిఏ పీఓ మంద మకరందు, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి (DPRO) విష్ణువర్ధన్, కమిటీ సభ్యులు నూకల దేవేందర్, బి.రమేష్, బి.వెంకటేష్, మహమ్మద్ హమీదుల్లా అన్వర్, పి. గజానన్, ఎం.సురేష్, టి.చిన్న అంజయ్య, బి.కిరణ్ కుమార్, జి.వినోద్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొని తమ సూచనలను అందించారు.

