సాధారణంగా ప్రపంచంలో రాజకీయ అస్థిరత, యుద్ధ వాతావరణం లేదా అంతర్జాతీయ సంక్షోభాలు తలెత్తినప్పుడు పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడం తగ్గించి బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. వెనిజులా సంక్షోభం తర్వాత మార్కెట్‌లో భయం పెరగడంతో బంగారం ధరలు ఒక్కరోజులోనే దాదాపు 2.4 శాతం పెరిగి కొత్త గరిష్టాలను తాకాయి. డాలర్‌పై ఒత్తిడి పెరగడం కూడా బంగారం ధరల పరుగుకు ప్రధాన కారణంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.
వెనిజులా ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు నిల్వలు కలిగిన దేశాల్లో ఒకటి. అక్కడి రాజకీయ సంక్షోభం వల్ల ఆయిల్ సరఫరాకు ఆటంకం ఏర్పడితే, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిన ప్రతిసారి బంగారం ధరలు బలపడటం సహజం. కమోడిటీ నిపుణుల ప్రకారం, చమురు ధరలు బ్యారెల్‌కు 65 డాలర్ల స్థాయిని దాటితే భారత మార్కెట్‌లో MCX గోల్డ్ ధరలు 10 గ్రాములకు రూ.1.40 లక్షల మార్కును సులభంగా చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే అందరూ ఇదే అభిప్రాయంలో లేరు. కొంతమంది నిపుణులు వెనిజులా ఇప్పటికే చాలా కాలంగా ఆంక్షల కిందనే ఉందని, ప్రస్తుత గ్లోబల్ ఎకానమీలో ఆ దేశ ప్రభావం పరిమితంగానే ఉందని గుర్తుచేస్తున్నారు. అందువల్ల బంగారం ధరల్లో కనిపిస్తున్న ఈ పెరుగుదల తాత్కాలికమే కావచ్చని వారు భావిస్తున్నారు. దీర్ఘకాలంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, ఆర్థిక విధానాలు మరియు బడ్జెట్ అంచనాలే బంగారం దిశను నిర్ణయిస్తాయని చెబుతున్నారు.

ప్రస్తుతం జనవరి 6, 2026 నాటికి MCX గోల్డ్ ధరలు రూ.1,41,000 నుంచి రూ.1,41,190 మధ్య ట్రేడవుతుండగా, వెండి ధరలు కూడా అదే బాటలో కేజీ రూ.2.43 లక్షల పైన కొనసాగుతున్నాయి. వెనిజులా ఇష్యూ బంగారం ధరలకు తక్షణ బూస్ట్ ఇచ్చిందన్నది నిజమే అయినప్పటికీ, ఈ ర్యాలీ ఎంతకాలం కొనసాగుతుందన్నది భవిష్యత్ రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ధరలు కొంత స్థిరపడిన తర్వాత కొనుగోలు చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
Author : QAMAR SD

