• చిన్న మన్నూరు అటవీ ప్రాంతంలో పట్టుబడిన నిందితులు
• కత్తులు, ద్విచక్ర వాహనాలు, ఉచ్చు తాడు స్వాధీనం
• వేటగాళ్లను ఉపేక్షించేది లేదని హెచ్చరించిన ఇచ్చోడ రూరల్ సీఐ రమేష్
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: మూగజీవాలను వధించేందుకు అడవిలోకి చొరబడిన నలుగురు వేటగాళ్లను గుడిహత్నూర్ పోలీసులు అరెస్టు చేశారు. మండల పరిధిలోని చిన్న మన్నూరు అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడేందుకు వెళ్లిన నలుగురు వ్యక్తులను గుడిహత్నూర్ ఎస్సై శ్రీకాంత్ తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై ఇచ్చోడా రూరల్ సీఐ సిహెచ్ రమేష్ పూర్తి వివరాలు వెల్లడించారు. పట్టుబడిన నిందితుల వద్ద నుంచి జంతువులను వేటాడేందుకు ఉపయోగించే 3 కత్తులు, 50 అడుగుల పొడవు గల ఒక ఉచ్చు (బెండింగ్ వైర్), రెండు మోటార్ సైకిళ్లు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పిట్టల వాడకు చెందిన నిందితులు అల్లకుంట లకన్ (21), అల్లకుంట తాళయ్య (40), అల్లకుంట తిరుపతి (21), అల్లకుంట నాగయ్య (42) లపై గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
వేటగాళ్లపై కఠిన చర్యలు తప్పవు: సీఐ రమేష్
వన్యప్రాణులను వేటాడడం, వాటికి హాని కలిగించడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని సీఐ రమేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వన్యప్రాణుల సంరక్షణలో ప్రజలు సైతం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా లేదా అటవీ ప్రాంతాల్లో వేట కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.
