HomeTrending Newsఖననం చేసిన శిశువు మృతదేహం అదృశ్యం

ఖననం చేసిన శిశువు మృతదేహం అదృశ్యం

• పంజాగుట్ట స్మశాన వాటికలో తీవ్ర కలకలం!

 * కవలల మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబానికి మరో షాక్

 * మొదటి శిశువును పాతిపెట్టిన చోట తీవ్వి చూస్తే శూన్యం

 * రూ. 2500 తీసుకుని పూడ్చిపెట్టిన స్మశానవాటిక సిబ్బంది

 * ‘మా బిడ్డ ఏమైంది?’ అంటూ తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు

 * రంగంలోకి బంజారాహిల్స్ పోలీసులు.. ముమ్మర దర్యాప్తు

 

వాస్తవ నేస్తం,హైదరాబాద్ (క్రైమ్ డెస్క్): పంజాగుట్ట స్మశాన వాటికలో దారుణ ఘటన వెలుగుచూసింది. పురిటిలోనే కన్నబిడ్డలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఓ కుటుంబానికి ఊహించని మరో విషాదం ఎదురైంది. నిన్న ఖననం చేసిన తమ పసికందు మృతదేహం మరుసటి రోజుకు మాయం కావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. బాధిత దంపతులకు ఆరు నెలలకే కవలలు జన్మించారు. నెలలు నిండకుండానే పుట్టడంతో ఇద్దరు శిశువులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారిలో ఒక శిశువు తొలుత తుదిశ్వాస విడిచింది. గుండెనిండా బాధతో ఆ పసికందును పంజాగుట్ట స్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడి సిబ్బంది రూ.2500 తీసుకుని మృతదేహాన్ని ఖననం చేశారు.

రెండో బిడ్డ కూడా దూరం కావడంతో..

విధి వక్రించి మరుసటి రోజు రెండో శిశువు కూడా మృతి చెందింది. దీంతో ఆ తల్లిదండ్రుల శోకానికి అవధులు లేకుండా పోయాయి. రెండో శిశువును కూడా మొదటి బిడ్డను పూడ్చిపెట్టిన చోటే ఖననం చేయాలని కుటుంబ సభ్యులు స్మశాన వాటికకు చేరుకున్నారు. అక్కడికి వెళ్లి చూడగా.. అప్పటికే ఖననం చేసిన మొదటి శిశువు మృతదేహం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

మా బిడ్డ ఏమైంది..? అంటూ అంటూ… పాతిపెట్టిన బిడ్డ మృతదేహం మాయమవ్వడంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా బిడ్డ మృతదేహం ఏమైంది.? ఎక్కడికి తీసుకెళ్లారు.? అంటూ స్మశాన వాటిక సిబ్బందిని నిలదీశారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అక్కడ కాసేపు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కన్నబిడ్డలను కోల్పోయిన బాధకు తోడు, కడసారి పూడ్చిపెట్టిన ఆనవాళ్లు కూడా లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది.

రంగంలోకి పోలీసులు..

బాధిత కుటుంబ సభ్యులు వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుటాహుటిన స్మశాన వాటికకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై స్మశానవాటిక సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. శిశువు మృతదేహం ఎలా మాయమైంది? దీని వెనుక సిబ్బంది నిర్లక్ష్యం ఉందా? గుప్త నిధులు, క్షుద్ర పూజల ముఠాల చేతివాటం ఏమైనా ఉందా.? లేక మరేదైనా కారణమా? అన్న కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular