రోజురోజుకు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారం కొనుగోలు సామాన్య ప్రజలకు కలగానే మిగలనుందా..? అని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి ఉప్పెనలా ఎగబాకాయి. జనవరి 16వ తేదీ, శుక్రవారం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,365 వద్ద స్థిరపడగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,220గా నమోదైంది. వెండి ధర కూడా ఆకాశాన్నంటుతూ కిలోకు రూ.2,82,936కు చేరుకుంది
అమెరికాలో పసిడి ధర ఔన్స్‌కు 4,600 డాలర్లకు పైగా ట్రేడ్ అవుతుండటం దేశీయ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా తాజా ఆంక్షల నేపథ్యంలో భౌగోళిక రాజకీయ అనిశ్చితి పెరగడంతో ఇన్వెస్టర్లు బంగారం, వెండి వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో విలువైన లోహాల ధరలు ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలకు చేరువయ్యాయి.
ఈ ధరల పెరుగుదల సామాన్య వినియోగదారులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో బంగారు ఆభరణాల కొనుగోళ్లు భారంగా మారాయని వినియోగదారులు వాపోతున్నారు. డిమాండ్ తగ్గడంతో అమ్మకాలు మందగించాయని, దీంతో వ్యాపారుల ఆదాయం కూడా తగ్గుతోందని నగల వర్తకులు చెబుతున్నారు.
మరోవైపు వెండి ధర గత రెండు వారాల్లోనే దాదాపు రూ.60,000 పెరగడం గమనార్హం. త్వరలోనే కిలో వెండి ధర రూ.3 లక్షల మార్కును దాటే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితి కొనసాగితే బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. స్వల్పకాలంలో వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గినా, దీర్ఘకాలంలో బంగారం సురక్షిత పెట్టుబడిగా మరింత ఆకర్షణీయంగా మారవచ్చు.
Author: Qamar SD

