📄 ePaper
Sunday, March 15, 2026
📄 ePaper
HomeBreaking Newsఇచ్చోడ ఎక్సైజ్ సీఐని తక్షణమే అరెస్ట్ చేయాలి'

ఇచ్చోడ ఎక్సైజ్ సీఐని తక్షణమే అరెస్ట్ చేయాలి’

• కిరాణా వ్యాపారిపై ఎక్సైజ్ పోలీసుల కక్షసాధింపు!

 • తనిఖీల పేరిట దౌర్జన్యం.. సరుకుల లూటీ

 • అక్రమ కేసులు పెడతామని బెదిరింపులు.. డబ్బులు వసూళ్లు

 • భయంతో కిరాణా దుకాణం మూసివేత

 • ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్‌లో బాధితుడి ఆవేదన

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : తనిఖీల పేరిట కిరాణా వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేస్తూ, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇచ్చోడ ఎక్సైజ్ సీఐ జుల్ఫికర్ అహ్మద్‌ను తక్షణమే సస్పెండ్ చేసి, అరెస్ట్ చేయాలని నేరడిగొండకు చెందిన బాధితుడు ముక్క శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. గత మూడు నెలలుగా ఎక్సైజ్ పోలీసులు పెడుతున్న చిత్రహింసలను మీడియా ముందు ఏకరువు పెట్టారు.

తనిఖీల పేరిట దౌర్జన్యం.. సరుకులు మాయం

తాను గత 45 సంవత్సరాలుగా నేరడిగొండ మండల కేంద్రంలో కిరాణా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని శ్రీనివాస్ తెలిపారు. 2025 డిసెంబర్ 15న ఇచ్చోడ ఎక్సైజ్ సీఐ జుల్ఫికర్ అహ్మద్ తన సిబ్బందితో (ఒక కానిస్టేబుల్, డ్రైవర్) కలిసి తనిఖీల పేరిట దుకాణానికి వచ్చారన్నారు. ఆ సమయంలో దుకాణంలో ఉన్న కస్టమర్లను బయటకు పంపించి, ఒకరిని గోదాంలోకి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. తినే బెల్లాన్ని స్వాధీనం చేసుకోవడమే కాకుండా, దుకాణంలో ఉన్న సుమారు రూ.28 వేల విలువైన 10 కిలోల యాలకులు, రూ.7 వేల విలువైన 10 కిలోల బాదం పలుకులను తీసుకెళ్లారని వాపోయారు. అంతేకాకుండా, సిబ్బంది కోసం మరో రూ.5 వేల విలువైన ఇంటి సరుకులను సైతం నాలుగు కవర్లలో నింపుకుని ఉచితంగా పట్టుకుపోయారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి :  Gold price in Hyderabad | హైదరాబాద్‌లో బంగారం ధరల పరుగు: సామాన్యుడికి భారమా? ఇన్వెస్టర్లకు వరమా?

డబ్బుల కోసం వేధింపులు.. తప్పుడు కేసుల భయం

తహసీల్దార్ వద్ద బైండోవర్ చేస్తే రూ.2 లక్షలకు పైగా ఖర్చవుతుందని భయపెట్టిన సీఐ.. తాను రూ.50 వేలకే పని పూర్తి చేస్తానని చెప్పి, ఈ నెల 5వ తేదీన రూ.50 వేల చలాన్ కట్టించారని బాధితుడు తెలిపాడు. ఆ పైన వ్యక్తిగతంగా మరో రూ.50 వేలు లంచంగా వసూలు చేశారని ఆరోపించారు. ఇంతటితో ఆగకుండా గత మూడు రోజులుగా వాట్సాప్ కాల్స్ ద్వారా తన సిబ్బందితో ఫోన్లు చేయిస్తూ, మరో రూ.50 వేలు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే మండలంలో ఎక్కడ గంజాయి, లిక్కర్ దొరికినా ఆ కేసును తనపైనే బనాయించి జైలుకు పంపుతామని బెదిరించారని పేర్కొన్నారు. వారి బెదిరింపులకు భయపడి తాను ఫోన్ నంబర్లు బ్లాక్ చేశానని, అప్పటి నుంచి దుకాణం మూసివేసి ప్రాణభయంతో బతుకుతున్నానని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారుల చుట్టూ తిరిగినా దక్కని న్యాయం

తనకు జరిగిన అన్యాయంపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు ప్రజా ఫిర్యాదుల విభాగం (గ్రీవెన్స్) ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ.. మూడు నెలలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితుడు వాపోయాడు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, విధి నిర్వహణను పక్కనపెట్టి వసూళ్లకు పాల్పడుతున్న ఇచ్చోడ ఎక్సైజ్ సీఐ జుల్ఫికర్ అహ్మద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, తన లాంటి సామాన్య వ్యాపారులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.

ఇది కూడా చదవండి :  Breaking News | సుల్తానాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో విషాదం
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page