• మల్టీ జోన్-1 పరిధిలో 15 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ
* ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ సంపత్ చంద్రశేఖర్ రెడ్డి
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: రాష్ట్రంలోని మల్టీ జోన్-1 పరిధిలో పలువురు పోలీసు అధికారులకు స్థానచలనం కలిగింది. పరిపాలనా కారణాల దృష్ట్యా మొత్తం 15 మంది సివిల్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ (IGP) సంపత్ చంద్రశేఖర్ రెడ్డి మే 2వ తేదీన అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తాజా ఉత్తర్వుల ప్రకారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా సీహెచ్. రమేష్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆయన ఆదిలాబాద్ పీసీఆర్ లో ఉంటూ ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌కు అటాచ్‌మెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. బండారి రాజు బదిలీతో ఖాళీ అయిన స్థానంలో రమేష్‌కు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ఇచ్చోడ సీఐగా నియమించారు. ఇక ఇక్కడ సీఐగా సేవలందించిన బండారి రాజును వరంగల్ కమిషనరేట్‌కు బదిలీ చేశారు. అదేవిధంగా, జగిత్యాల వీఆర్ లో ఉన్న నరేష్‌ను ఆదిలాబాద్ పీసీఆర్‌కు బదిలీ చేసి, ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. బదిలీ అయిన అధికారులందరినీ వెంటనే రిలీవ్ చేసి, వారు కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించేలా తదుపరి చర్యలు తీసుకోవాలని సంబంధిత యూనిట్ అధికారులను ఐజీ ఆదేశించారు.

