• ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఇచ్చోడ పోలీసులు
• అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: సీఐ నరేష్ కుమార్
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: గ్రామంలో పరువు తీస్తామని బెదిరించి, పంచాయతీ పేరుతో ఓ వ్యక్తి నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఇచ్చోడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) నరేష్ కుమార్ తెలిపారు. బాధిత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్చోడ మండలంలోని సిరిచల్మ గ్రామానికి చెందిన రాజారపు సందీప్ అనే వ్యక్తికి ఓ మహిళతో అక్రమ సంబంధం ఉంది. కాగా, ఈ విషయం సదరు మహిళ భర్తకు తెలిసింది. ఇదే అదునుగా భావించిన అదే గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ అబ్దుల్ అజీమ్, సర్పంచ్ కాలా రవీందర్ అనే వ్యక్తులు సందీప్‌ను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు. గ్రామంలో పంచాయతీ పెట్టి ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా చేసి పరువు తీస్తామని బెదిరించారు. ఈ సమస్యను ఇక్కడితోనే పరిష్కరించుకోవాలంటే తమకు రూ. 1,50,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ప్రాణాలు తీస్తామని నిందితులు తీవ్ర స్థాయిలో బెదిరింపులకు గురిచేశారు. వారి బెదిరింపులతో తీవ్ర భయాందోళనలకు గురైన బాధితుడు సందీప్.. తన సోదరుడి ద్వారా ఆ ఇద్దరికీ రూ. 50 వేల నగదును అందజేశాడు. అనంతరం బాధితుడు ధైర్యం చేసి బుధవారం ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులు అబ్దుల్ అజీమ్, కాలా రవీందర్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సీఐ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ.. ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఇలాంటి బెదిరింపులకు, అక్రమ వసూళ్లకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
