• వాహనం సీజ్, 5 కిలోల మాంసం స్వాధీనం
• జంతు హింసకు పాల్పడితే ఉక్కుపాదం: సీఐ నాగరాజు
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: వధశాలలకు అక్రమంగా ఎడ్లను తరలిస్తున్న ఓ ముఠాను ఆదిలాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 9 ఎడ్లను రక్షించడంతో పాటు, రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేశారు. ఆదిలాబాద్ టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, అందులో 9 చిన్న ఎడ్లను అత్యంత అమానుషంగా, కిక్కిరిసినట్లుగా తాళ్లతో కట్టి వధశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో వాహనంలో ఉన్న 5 కిలోల మాంసాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల వద్ద జంతువుల కొనుగోలుకు సంబంధించిన ఎలాంటి రసీదులు గానీ, రవాణా చేయడానికి అవసరమైన చట్టబద్ధమైన అనుమతులు గానీ లేవని పోలీసులు నిర్ధారించారు. కనీసం వెటర్నరీ వైద్యుడి నుంచి పొందిన ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు కూడా లేకుండా నిబంధనలకు పాతరేశారు. ఈ దాడుల్లో రక్షించిన 9 చిన్న ఎడ్లను సంరక్షణ నిమిత్తం పోలీసులు సురక్షితంగా స్థానిక గోశాలకు తరలించారు. ఈ దాడుల్లో పట్టుబడిన నిందితులంతా నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అబ్దుల్ ఖాదీర్ కుమారులైన అబ్దుల్ జహీర్ (29), అబ్దుల్ నజీర్ (40), అబ్దుల్ రఫీక్ (29), అబ్దుల్ బషీర్ (అలియాస్ బషీర్ ఖురేషి-32) లను అరెస్ట్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
జంతువులను అక్రమంగా రవాణా చేయడం, వధించడం, మాంసం అక్రమ వ్యాపారం నిర్వహించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై జిల్లా పోలీస్ శాఖ నిరంతరం ప్రత్యేక నిఘా ఉంచింది. జంతు సంరక్షణ చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటువంటి అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయాలి సీఐ అన్నారు.
