• కామారెడ్డి జిల్లాలో ఘటన.. షర్ట్ జేబులోనే కాలిపోయిన మొబైల్
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: భానుడి భగభగలకు మనుషులే కాదు, చేతిలోని స్మార్ట్ ఫోన్లు కూడా బెంబేలెత్తుతున్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు సైతం తట్టుకోలేక పేలిపోతున్నాయి. తాజాగా ఎండ వేడిమికి జేబులో ఉన్న మొబైల్ ఫోన్ ఉన్నట్లుండి పేలిపోవడంతో ఓ మాజీ సర్పంచ్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
కామారెడ్డి జిల్లా మక్దంపూర్ గ్రామ మాజీ సర్పంచ్ చంద్ర గౌడ్ ఎప్పటిలాగే తన స్మార్ట్ ఫోన్‌ను (శాంసంగ్) షర్ట్ జేబులో పెట్టుకుని బయటకు వెళ్లారు. ప్రస్తుతం ఎండలు మండిపోతుండటంతో, ఆ తీవ్రమైన వేడికి జేబులో ఉన్న ఫోన్ ఒక్కసారిగా వేడెక్కి పెద్ద శబ్దంతో పేలిపోయింది.
ఈ ప్రమాదంలో మొబైల్ ఫోన్ రెండు ముక్కలై, బ్యాటరీ పూర్తిగా కాలిపోయి పనికిరాకుండా పోయింది. ఫోన్ పేలుడు ధాటికి చంద్ర గౌడ్ వేసుకున్న తెల్ల చొక్కా జేబు వద్ద పూర్తిగా కాలిపోయింది. అంతేకాకుండా లోపల ఛాతీ భాగంలో చర్మానికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. అయితే, వెంటనే అప్రమత్తమై ఫోన్‌ను బయటకు తీసివేయడంతో పెను ప్రమాదం తప్పిందని, తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని ఆయన ఊపిరి పీల్చుకున్నారు.
నిపుణుల సూచనలు – వేసవిలో స్మార్ట్ ఫోన్ జాగ్రత్తలు:
వేసవిలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్న నేపథ్యంలో మొబైల్ బ్యాటరీలు త్వరగా వేడెక్కే (Overheat) ప్రమాదం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు ఈ కింది జాగ్రత్తలు పాటించడం ఉత్తమం. నేరుగా ఎండ తగిలేలా చొక్కా జేబులో లేదా బిగుతుగా ఉండే ప్యాంట్ జేబుల్లో ఫోన్లను ఉంచకూడదు. బ్యాగుల్లో ఉంచుకోవడం సురక్షితం. ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు ఫోన్‌ను నేరుగా సూర్యరశ్మి పడే చోట (హ్యాండిల్ బార్ కవర్లలో) ఉంచవద్దు. ఫోన్ వేడెక్కినట్లు అనిపిస్తే, వెంటనే దానికి ఉన్న బ్యాక్ కేస్ (కవర్) తీసేసి కాసేపు పక్కన పెట్టాలి. రాత్రంతా ఛార్జింగ్ పెట్టడం లేదా ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడటం, గేమ్స్ ఆడటం లాంటివి వేసవిలో మరింత ప్రమాదకరం.
