• మంత్రి జూపల్లి కృష్ణారావుకు సర్పంచ్ షేక్ ఇమ్రాన్ వినతి
• సీసీ రోడ్లు, డ్రైన్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరిక
• అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్న యువ సర్పంచ్
• సానుకూలంగా స్పందించిన మంత్రి జూపల్లి
వాస్తవ నేస్తం ఇచ్చోడ : మండలంలోని మాధాపూర్ గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ ఆ గ్రామ నూతన సర్పంచ్ షేక్ ఇమ్రాన్ రాష్ట్ర మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఆయన, పలు అభివృద్ధి పనుల మంజూరు కోరుతూ ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా తక్షణమే సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ ఇమ్రాన్ షాదుల్లా మంత్రిని కోరారు. అలాగే నూతన గ్రామపంచాయతీ భవనం, ప్రజల వైద్య అవసరాల నిమిత్తం హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణాలు చేపట్టాలని విన్నవించారు. సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న గ్రామంలోని నిరుపేద కుటుంబాలను గుర్తించి, వారికి తక్షణమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
యువ సర్పంచ్ చురుకైన అడుగులు..
ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాధాపూర్ సర్పంచ్‌గా ఎన్నికైన యువకుడు షేక్ ఇమ్రాన్ షాదుల్లా.. బాధ్యతలు చేపట్టిన నాటినుంచి గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. గత కాలంగా అసంపూర్తిగా నిలిచిపోయిన, పెండింగ్‌లో ఉన్న పనులను సైతం ఆయన తన ప్రత్యేక చొరవతో పూర్తి చేసేలా పరుగులు పెట్టిస్తున్నారు. సీనియర్ నాయకుల సలహాలు, సూచనలు తీసుకుంటూ పల్లె ప్రగతికి నిరంతరం శ్రమిస్తున్న యువ సర్పంచ్ పనితీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
సర్పంచ్ ఇమ్రాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు షాదుల్లా తదితరులు వివరించిన గ్రామ సమస్యలను మంత్రి జూపల్లి కృష్ణారావు సావధానంగా విన్నారు. మాధాపూర్ గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తానని, కోరిన నిధులు, అభివృద్ధి పనుల మంజూరుపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ వారికి హామీ ఇచ్చారు.
