📄 ePaper
Thursday, May 21, 2026
📄 ePaper
HomePolitical Newsరాజకీయ చదరంగంలో 'విజయ్' గర్జన: కష్టాల కడలి దాటి ముఖ్యమంత్రి పీఠం వైపు దళపతి పయనం!

రాజకీయ చదరంగంలో ‘విజయ్’ గర్జన: కష్టాల కడలి దాటి ముఖ్యమంత్రి పీఠం వైపు దళపతి పయనం!

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. వెండితెర వేల్పులను ఆరాధ్య దైవాలుగా, పాలకులుగా స్వీకరించే ఆ గడ్డపై… ఇప్పుడు మరో నవశకం ఊపిరి పోసుకుంటోంది. దశాబ్దాలుగా ఎంతోమంది సూపర్ స్టార్ల రాజకీయ ప్రవేశాలు చూసిన తమిళనాట, ఇప్పుడు ‘దళపతి’ విజయ్ వంతు వచ్చింది. అయితే, ఆయన ప్రయాణం పూలపాన్పు కాలేదు… ప్రారంభంలోనే ముళ్లబాటగా మారింది. అయినా సరే, ఎదురుగాలిలో జెండా ఎగరేస్తూ, అడ్డంకులన్నింటినీ తుత్తునియలు చేస్తూ… తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా ఆయన అవతరించబోతున్నారన్న సంకేతాలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.

2024 ఫిబ్రవరి 2న ‘తమిళగ వెట్రి కజగం'(TVK) పార్టీని స్థాపించి, రాజకీయాల్లోకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చారు విజయ్. అప్పటివరకు ఒక సూపర్ స్టార్ గా నీరాజనాలు అందుకున్న ఆయనకు, రాజకీయ రంగ ప్రవేశం చేసిన క్షణం నుంచే అడుగడుగునా కఠిన పరీక్షలు ఎదురయ్యాయి.

సెప్టెంబర్ 27న విక్రవాండిలో నిర్వహించిన సభలో ఊహించని పరిణామం ఎదురైంది. సభలో కటౌట్లు పడిపోయి సుమారు 41 మంది అభిమానులు గాయపడటం ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రంగా మారింది.

రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన తర్వాత ఆయన నటించిన గోట్ (GOAT) సినిమాకు ప్రేక్షకుల నుండి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడం, ఒక మోస్తరు లేదా నెగటివ్ టాక్ వినిపించడం ఆయన వ్యతిరేకులకు ఉత్సాహాన్నిచ్చింది.

విజయ్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతూ భారీ మీటింగ్ కు ప్లాన్ చేసుకుంటే, సరిగ్గా మూడు నెలల ముందు కురిసిన భారీ వర్షాల కారణంగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

అగ్నిపరీక్షల్లో నిలిచిన ‘అభిమానం’..

సాధారణంగా ఒక కొత్త నాయకుడికి మొదటి అడుగుల్లోనే ఇన్ని ఇబ్బందులు, అపశృతులు ఎదురైతే… డీలా పడిపోతారు. పార్టీ క్యాడర్ చెల్లాచెదురవుతుంది. కానీ విజయ్ బలం ఆయన రాజకీయ వ్యూహాలు మాత్రమే కాదు, ఆయన్ని ప్రాణంగా ప్రేమించే ‘అభిమానులు’.

వరుసగా అడ్డంకులు ఎదురవుతున్నా, ఇబ్బందులు చుట్టుముడుతున్నా అభిమానులు ఆయన వెన్నంటే అండగా నిలిచారు. సవాళ్లు ఎదురైన ప్రతిసారీ “మేమున్నాం దళపతి” అంటూ ఆయనకు జై కొట్టారు. ఆ అచంచలమైన మద్దతే విజయ్ కి కొండంత అండగా మారి, ఆయనను మరింత పట్టుదలతో ముందుకు నడిపిస్తోంది.

దాటి… ‘అధికారం’ దిశగా.!

ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో బలమైన, ఆకర్షణీయమైన నాయకత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ వాక్యూమ్ ను భర్తీ చేసే ప్రత్యామ్నాయ శక్తిగా దళపతి తనను తాను మలచుకుంటున్నారు. ప్రారంభంలో ఎదురైన కష్టాలు, సవాళ్లు ఆయనకు క్షేత్రస్థాయి రాజకీయ పాఠాలు నేర్పించాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకుంటూ, ఆయన వేస్తున్న అడుగులు ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.

కరుణానిధి, జయలలిత లాంటి ఉద్దండుల తర్వాత ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు విజయ్ మాత్రమే. ఈ అడ్డంకులన్నీ ఆయన విజయానికి కేవలం పునాది రాళ్లు మాత్రమేనని, రాబోయే ఎన్నికల్లో TVK పార్టీ సునామీ సృష్టించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

వెండితెరపై ఎన్నో సార్లు విలన్లను మట్టికరిపించిన హీరో… ఇప్పుడు రియల్ లైఫ్ పాలిటిక్స్ లో తనదైన మార్క్ చూపించడానికి సిద్ధమయ్యారు. ఎన్నో అడ్డంకులు, కుట్రలు, ప్రకృతి వైపరీత్యాలను సైతం చిరునవ్వుతో ఎదుర్కొని, తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై ‘విజయ్’ కూర్చోవడం లాంఛనమే అని ఆయన వర్గం బలంగా విశ్వసిస్తోంది. ఒక సామాన్య ‘దళపతి’ స్థాయి నుండి ‘ముఖ్యమంత్రి’ స్థాయికి ఆయన చేయబోయే పయనం తమిళ రాజకీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా మిగిలిపోనుంది.!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular